Begin typing your search above and press return to search.

మిర్చి చేస్తుండగా అమ్మ చనిపోయింది

By:  Tupaki Desk   |   16 Aug 2015 12:27 PM GMT
మిర్చి చేస్తుండగా అమ్మ చనిపోయింది
X
ఎంత పెద్ద దర్శకుడికైనా తొలి సినిమా ఓ మధుర జ్నాపకం. తొలి సినిమా అందరి మెప్పూ పొందితే వచ్చే ఆనందమే వేరు. ఆ సంతోషాన్ని తన కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో పంచుకోవాలనుకుంటాడు. ముఖ్యంగా ఆ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని చూడ్డానికంటే సంతోషం ఇంకేముంటుంది? ఐతే ‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొరటాల శివకు మాత్రం ఆ అదృష్టం లేకపోయింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన కొరటాల.. మిర్చి షూటింగ్ చేస్తున్న సమయంలో తల్లిని కోల్పోవడం పెద్ద విషాదం. ఐతే ఆ సంగతి టాలీవుడ్ లో చాలామందికి తెలియదు. కొరటాల కూడా ఎప్పుడూ ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నది లేదు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ బాధాకర అనుభవం గురించి మాట్లాడాడు కొరటాల.

‘‘మాది గుంటూరు జిల్లా పెదకాకాని. నాన్న పంచాయితీరాజ్ విభాగంలో అధికారిగా పని చేసేవారు. ఐతే నాకు పదేళ్ల వయసుండగా ఆయన చనిపోయారు. మా అమ్మ పంచాయితీరాజ్ లో ఉద్యోగం చేస్తూ నన్ను, అన్నయ్యను కష్టపడి చదివించి పెద్ద చేసింది. ఐతే నేను దర్శకుడిగా మారి మిర్చి తీస్తున్న సమయంలో అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తాను నాటి, పెంచిన చెట్టు పండ్లు రుచి చూడకుండానే వెళ్లిపోయిందనిపించింది. అదొక్కటే నన్ను చాలా బాధిస్తుంది. నా విజయాన్ని అందరికంటే ఎక్కువ ఆస్వాదించేది అమ్మే. అలాంటి అమ్మ దర్శకుడిగా నా తొలి విజయాన్ని చూడలేకపోయింది. ఇప్పటికీ నేనే చిన్న విజయం సాధించినా అమ్మ ఉంటే.. ఆమె ఆనందిస్తే బాగుంటుందనిపిస్తుంది. జీవితంలో మా అమ్మ లాంటి నిజమైన హీరోల్ని చాలామందిని చూశాను. వాళ్లే నా కథలకు స్ఫూర్తి’’ అని చెప్పాడు కొరటాల.