Begin typing your search above and press return to search.

ద్వితీయ విఘ్నమా.. హహహ!

By:  Tupaki Desk   |   13 Aug 2015 1:41 PM GMT
ద్వితీయ విఘ్నమా.. హహహ!
X
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. సక్సెస్ రేట్ బాగా తక్కువ కాబట్టి.. ఏ చిన్న నెగిటివ్ విషయాన్నయినా బూతద్దంలో పెట్టి చూస్తారు ఇక్కడి జనాలు. మామూలుగా సెంటిమెంట్లను పట్టించుకోని వాళ్లు కూడా సినిమాల్లోకి వచ్చాక పనికి రాని సెంటిమెంట్లకు విలువనిస్తుంటారు. పరిశ్రమలో బాగా ప్రచారంలో ఉన్న సెంటిమెంట్లలో దర్శకుల ‘ద్వితీయవిఘ్నం’ సెంటిమెంటు ఒకటి. తొలి సినిమా అద్భుతంగా తీసిన చాలామంది పెద్ద డైరెక్టర్లు సైతం ఈ సెంటిమెంటుతో దెబ్బ తిన్నవాళ్లే. డైరెక్టర్ల రెండో సినిమా ఫెయిలవ్వడానికి కారణాలు ఉన్నా.. సెంటిమెంటు గురించే మాట్లాడే జనాలు చాలామంది ఉన్నారు. ఐతే ఈ సెంటిమెంటు తప్పు అని నిరూపించిన వాళ్లూ లేకపోలేదు. అందులో కొరటాల శివ ఒకడు. అతడి తొలి సినిమా ‘మిర్చి’ కంటే కూడా రెండో సినిమా ‘శ్రీమంతుడు’ మరింత పెద్ద హిట్టయింది.

మరి కొరటాల దగ్గర ఈ ద్వితీయ విఘ్నం సెంటిమెంటు గురించి ప్రస్తావిస్తే అతనేమన్నాడో చూడండి. ‘‘సినిమా పూర్తయ్యే వరకు అసలు ఈ సెంటిమెంటు గురించి ఆలోచించనే లేదు. విడుదల సమయంలో ఒకరిద్దరు ఈ విషయమై నాతో చెప్పారు. ఇలాంటి సెంటిమెంటుపై నాకు నమ్మకం లేుద. ద్వితీయవిఘ్నం అన్నదే నిజమైతే మహేష్ ‘శ్రీమంతుడు’ చేయడానికి ఒప్పుకునేవాడే కాదు. మహేష్ మాత్రమే కాదు.. ఏ హీరో కూడా ఓ దర్శకుడికి రెండో సినిమా అవకాశమే ఇవ్వరు కదా. తొలి సినిమాతో హిట్ అందుకున్న కొందరు దర్శకులు ఆ తర్వాతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనే ఉత్సాహంలో పూర్తిగా స్క్రిప్టు సన్నద్ధం కాకుండానే సినిమా తీయడానికి ముందుకొస్తారు. దాంతో వారు ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొంటారు. కానీ ఆ సెంటిమెంటు మాత్రం నిజం కాదు. నా వరకు నేను తొలి సినిమా కంటే బాగా రెండో సినిమాకు స్క్రిప్టు సిద్ధం చేశాను. అందుకే విజయవంతమయ్యాను’’ అని కొరటాల చెప్పాడు.