Begin typing your search above and press return to search.

జనతా గ్యారేజ్ టైటిల్ వెనుక కథేంటి?

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:30 AM GMT
జనతా గ్యారేజ్ టైటిల్ వెనుక కథేంటి?
X
జనతా గ్యారేజ్.. వినడానికి.. చూడ్డానికి పాత టైటిల్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ టైటిలే జనాలకు భలేగా నచ్చేసింది. మరి ఈ సినిమాకు ఈ టైటిలే పెట్టడానికి కారణం ఏంటి అంటే పాత రోజుల్లోకి వెళ్లిపోయాడు కొరటాల శివ. ‘‘జనతా గ్యారేజ్ అన్న టైటిల్ పెట్టడానికి పాత రోజులే కారణం. ఇప్పుడు కాదు గానీ.. 80ల్లో ‘జ‌న‌తా’ అనే పేరు చాలా పాపుల‌ర్‌. జ‌న‌తా ఖాదీ.. జ‌న‌తా టైల‌ర్‌.. ఇలాంటి పేర్లు ఎక్కువ‌గా క‌నిపించేది. జ‌నతా థియేట‌ర్ కూడా ఎక్క‌డో చూశా. జ‌న‌తా.. అంటే జ‌నం అని అర్థం. జ‌నం గురించి మాట్లాడుకొనేట‌ప్పుడు ఆ మాట వాడ‌తాం. నా కథ కూడా జ‌నాలకు సంబంధించిందే. అందుకే ఆ పేరు పెట్టాం. క‌థ రాస్తున్న‌ప్పుడే ఈ టైటిల్ కు ఫిక్స్ అయిపోయాను’’ అని కొరటాల చెప్పాడు.

ఇంతకీ ‘జనతా గ్యారేజ్’తో హ్యాట్రిక్ కొట్టేయబోతున్నారా అని కొరటాలను అడిగితే.. ‘‘మిర్చి బాగా ఆడాక‌.. దాని కంటే మంచి క‌థ రాయాలనే ఉద్దేశంతో కష్టపడి ‘శ్రీ‌మంతుడు’ రాశాను. ఆ త‌ర్వాత దాని కంటే మంచి కథ కోసం ఆలోచించి ‘జ‌న‌తా గ్యారేజ్’ రాశాను. నా దృష్టంతా మంచి క‌థ రాయడంపైనే ఉంటుంది. మరి దాన్ని హిట్ అంటారా... సూపర్ హిట్ అంటారా.. లేక హ్యాట్రిక్ హిట్ అంటారా అన్నది ప్రేక్షకులే చెప్పాలి’’ అని కొరటాల అన్నాడు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా తనతో సినిమా అనగానే కొంచెం భయమేసిందని.. కొన్నిసార్లు సినిమాల ఫలితాల వల్ల వ్యక్తిగత అనుబంధాలు తింటాయన్న ఆందోళనే ఇందుకు కారణమని.. ఐతే ‘జనతా గ్యారేజ్’లో తమ ప్రయాణం సాఫీగా సాగిపోయిందని కొరటాల చెప్పాడు.