Begin typing your search above and press return to search.

దేవుడు ఎంత పేరు ఇచ్చాడో అన్ని కష్టాలూ ఇచ్చాడు: కోట

By:  Tupaki Desk   |   22 Oct 2021 5:02 AM GMT
దేవుడు ఎంత పేరు ఇచ్చాడో అన్ని కష్టాలూ ఇచ్చాడు: కోట
X
తెలుగు తెరతో .. తెలుగు సినిమాతో పరిచయం ఉన్నవారికి కోట శ్రీనివాసరావు పేరు తెలియకుండా ఉండదు. అప్పటివరకూ నడిచిన విలనిజానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, అప్పటి నుంచి తనదైన విలనిజాన్ని ఆయన పరుగులు తీయించారు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ ఎవరూ అనుకరించలేనిది. 'ప్రతిఘటన' సినిమా నుంచి ఇంతవరకూ వేషాల కోసం ఆయన వెయిట్ చేసే పరిస్థితి లేకపోవడమే ఆయన గొప్పదనానికి నిదర్శనం. అలాంటి కోట శ్రీనివాసరావు, తాజా ఇంటర్వ్యూలో తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.

"నేను అసలు సినిమాలలోకి వెళ్లాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు .. మీరు నమ్మండి .. నమ్మకపోండి. ఏదో బ్యాంకులో పనిచేస్తున్నాము .. మంచి ఉంద్యోగం .. పిల్లా జిల్లా అంతా బాగానే ఉన్నాము. ఎందుకు దీనిని పాడు చేసుకోవడం అనే ప్రయత్నం చేయలేదు. వేషాల కోసం వెళితే 'నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా?' అంటారేమోనని భయం. అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. 20 ఏళ్లపాటు నాటకాలు వేసి మంచి పేరు తెచ్చుకున్నాను. జంధ్యాల గారు నాకు కాలేజ్ రోజుల నుంచి తెలుసు. ఆయన తన సినిమాల్లో వేషాలు ఉంటే పిలిచేవాడు .. అప్పుడు వెళ్లి చేసి వస్తుండేవాడిని.

ఆర్టిస్టుకు టైమ్ వస్తే టైమ్ ఉండదు .. అప్పుడు గనుక 'ఏంట్రా ఈ గోల .. ఇప్పుడు ఎందుకు పనిచేయడం' అని బద్ధకిస్తే ఉన్నది కాస్తా పోతుంది. రోజుకి 20 గంటలు కాదు .. మూడు స్టేట్లలో పని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకే చెబుతుంటాను ఆర్టిస్టుకు టైమ్ వస్తే దేనికీ టైమ్ ఉండదు .. లైఫ్ కూడా వాడి చేతిలో ఉండదు. 1968లో నాకు పెళ్లి అయింది. 1973లో మా ఆవిడ డెలివరీ అయిన తరువాత మా అత్తగారు పోయింది. ఆ షాక్ లో ఆమె మానసిక స్థితిని కోల్పోయింది. నాకు చాలా సన్నిహితులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు .. నేను చెప్పలేదు. ఎందుకంటే ట్యూబ్ లో నుంచి బయటికి వచ్చిన పేస్టును .. గుమ్మం దాటి వెళ్లిన సంసారాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేము.

నా రెండో కూతురు బాగా చదువుకుంది .. విజయవాడలో సరదాగా రిక్షాలో వెళుతోంది .. ఎదురుగా వచ్చే లారీ బ్రేక్ ఫెయిలై ఆ రిక్షాపైకి దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ఆమె ఒక కాలును కోల్పోయింది. ఆ పిల్ల పెళ్లి గురించి నేను ఎంతో ఏడ్చాను .. నేను బ్యాంకులో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశానో ఆయనే నా కూతురుని కోడలుగా చేసుకున్నాడు. సరేలే జీవితం బాగానే ఉందిలే నడుస్తోందని అనుకున్నాను. అందరికీ తెలిసిందే .. మా అబ్బాయి యాక్సిడెంట్ లో పోయాడు. ఇన్ని బాధలు ఉన్నప్పటికీ పది పన్నెండు ఏళ్లుగా కెరియర్ ను నెట్టుకొస్తూనే ఉన్నాను. ఆ భగవంతుడు ఎంత పేరు ఇచ్చాడో అని కష్టాలు కూడా ఇచ్చాడు. వాటిని తట్టుకునే గుండెకూడా ఇచ్చాడు .. అంతే" అంటూ చెప్పుకొచ్చారు.