Begin typing your search above and press return to search.

ప‌ల్లెటూర‌మ్మాయ్ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయితే?

By:  Tupaki Desk   |   24 May 2019 1:26 PM GMT
ప‌ల్లెటూర‌మ్మాయ్ అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ అయితే?
X
ఒక ప‌ల్లెటూరి అమ్మాయి.. స్టేడియంలో అంత‌ర్జాతీయ మ్యాచ్ ఆడుతుంటే.. ప్ర‌పంచం మొత్తం త‌న ట్యాలెంట్ ని చూసి మెచ్చుకుంటే ఆ కిక్కు ఎలా ఉంటుంది? ఒక రైతు కుమార్తె అంచెలంచెలుగా దేశ‌వాళీ క్రికెట్ ఆడి అంత‌ర్జాతీయ స్థాయిలో రాణించి మ‌రో మిథాలీ రాజ్ అని నిరూపించుకుంటే ఎలా ఉంటుంది? స‌రిగ్గా అలాంటి పాయింట్ తో తెర‌కెక్కుతున్న సినిమా `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` అని చెబుతున్నారు క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్.రామారావు. త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన `కాన‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజిన‌ల్ లో న‌టించిన ఐశ్వ‌ర్యా రాజేష్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. 50 ఏళ్ల కెరీర్ లో 47 పైగా సినిమాలు నిర్మించిన కె.ఎస్.రామారావు స్పోర్ట్స్ బేస్డ్ మూవీస్ అంటే త‌న‌కు ఎంతో అబ్సెష‌న్ అని చెబుతుంటారు. ఇదివ‌ర‌కూ శ‌ర్వానంద్ - నిత్యామీన‌న్ జంటగా తెర‌కెక్కించిన `మ‌ళ్లి మ‌ళ్లి ఇది రాని రోజు` అథ్లెట్ క‌థాంశంతో తెర‌కెక్కింది. ఆ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ క్రిటిక్ అవార్డ్ ద‌క్కిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోసారి ఇంచుమించు అదే త‌ర‌హాలో అవార్డులు రివార్డుల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ సాధించే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని ఆయ‌న నిర్మిస్తున్నారు. తాజాగా `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` మోష‌న్ పోస్ట‌ర్ ని హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో ద‌ర్శ‌కుడు భీమ‌న‌ని శ్రీ‌నివాస‌రావు స్వ‌యంగా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ-``కౌశ‌ల్య పాత్ర‌లో ఐశ్వ‌ర్య రాజేష్ అద్భుత‌మైన హావ‌భావాల్ని ప‌లికింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్.. ప‌ల్లెటూరు.. రైతు నేప‌థ్యం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. సినిమా క‌థాంశం ఆద్యంతం ఎమోష‌న‌ల్ గా సాగుతుంది. ఎన్నో రీమేక్ చిత్రాల్ని తెర‌కెక్కించిన భీమ‌నేని శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మ‌లిచారు. ఐశ్వ‌ర్యా రాజేష్ గొప్ప న‌టి. ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించింది. త‌న హృద‌యానికి బాగా ద‌గ్గ‌రైన చిత్ర‌మిద‌ని ఐశ్వ‌ర్య ఈ చిత్రంలో మ‌న‌సు పెట్టి న‌టించారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. జూన్ చివ‌రి వారంలో లేదా జూలై తొలి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం`` అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు భీమ‌నేని శ్రీ‌నివాస్ మాట్లాడుతూ-`` తెలుగు ప్రేక్ష‌కులు కొత్త త‌ర‌హా క‌థ‌లు కోరుకుంటున్నారు. అదే త‌ర‌హాలో ర‌క్తి క‌ట్టించే క‌థాంశ‌మిది. త‌మిళ చిత్రం కానా చూశాను. తెలుగు తెర‌కు ఈ సినిమా తేగ‌ల‌నా? అని సందేహించాను. స‌రిగ్గా ఆ టైమ్ లో నిర్మాత కె.ఎస్.రామారావు గారు నాకు ఫోన్ చేసి ఓ త‌మిళ చిత్రం కొన్నాను. తెలుగులో తీయాలి అని అన్నారు. ఆ సినిమానే `కాన‌`. నేను అప్ప‌టికే చూసి అభిమానించిన సినిమాని తిరిగి నేనే తీసే అవ‌కాశం ద‌క్కింది. అవ‌కాశం ఇచ్చిన కె.ఎస్.రామారావు గారికి ధ‌న్య‌వాదాలు. త‌మిళంలో 20-30 సినిమాల్లో న‌టించి స్టార్ డ‌మ్ అందుకున్న ఐశ్వ‌ర్య రాజేష్ ఈ చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించారు. త‌న‌కు ప‌ర్స‌న‌ల్ గా న‌చ్చిన సినిమా కాబ‌ట్టి తెలుగు రీమేక్ లోనూ మ‌న‌సు పెట్టి న‌టించారు. ఆన్ లొకేష‌న్ త‌న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. త‌నో గొప్ప న‌టి. ఎమోష‌న్ స‌న్నివేశాల్లో గ్లిజ‌రిన్ అవ‌స‌రం లేకుండా న‌టించేంత గొప్ప పెర్ఫామ‌ర్. ఆ సంగ‌తిని సినిమా చూశాక మీరే చెబుతారు. 50 ఏళ్ల‌లో 47 చిత్రాలు తీసిన నిర్మాత ఈ సినిమా తీయ‌డం ఆనందంగా ఉంది`` అని తెలిపారు. ఈ వేదిక‌పై మోష‌న్ పోస్ట‌ర్ ని భీమ‌నేని స్వ‌యంగా ఆవిష్క‌రించారు. మోష‌న్ పోస్ట‌ర్ లో ప‌ల్లెటూర‌మ్మాయిగా ఐశ్వ‌ర్యా రాజేష్ లుక్ ఆక‌ట్టుకుంది. బ్యాక్ డ్రాప్ లో ప‌చ్చ‌ని పైరు .. రైతు నేప‌థ్యం .. క్రికెట్ స్టేడియంను మోష‌న్ పోస్ట‌ర్ లో ఎలివేట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.