Begin typing your search above and press return to search.

అంతగనం దర్శకేంద్రుడి ఆటోబయోగ్రఫీలో ఏవుందబ్బా?!

By:  Tupaki Desk   |   25 May 2022 8:30 AM GMT
అంతగనం దర్శకేంద్రుడి ఆటోబయోగ్రఫీలో ఏవుందబ్బా?!
X
తెలుగు సినిమా పౌరాణికాలు .. జానపదాలు దాటుకుని పూర్తిగా సాంఘిక చిత్రాల బాటలోనే నడుస్తున్న రోజుల్లో రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టుకున్నారు. ఆరంభంలో కుటుంబ కథా చిత్రాల పట్ల ఆసక్తిని చూపించిన ఆయన, ఆ తరువాత మాస్ అంశాలు అవసరమని భావించి, యాక్షన్ పాళ్లు పెంచారు.

అప్పటి కథల్లో కష్టాలు .. కన్నీళ్లు ఎక్కువగా ఉండేవి. అవి చూడటానికి థియేటర్ కి వెళ్లడం ఎందుకు? అనే ఆలోచన ఆడియన్స్ కి రాకుండా రొమాన్స్ పాళ్లను కూడా పెంచారు. అందుకోసం ఆయన పాటల పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

ఇలా ఒక సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి ఏమేం ఆశించి వస్తాడో అవి అందించడానికి అవసరమైన అంశాలను ఆయన తన కథల్లో సర్దేశారు. సమస్యలతో పోరాడే హీరోను అనుసరిస్తూ వెళ్లే ప్రేక్షకులు, ఆ హీరోతో పాటు కాస్త రిలాక్స్ కావడానికిగాను ఆయన హీరోయిన్ల సంఖ్యను పెంచారు.

అలా ఎక్కడ అవసరమైతే అక్కడ .. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గ్లామర్ టచ్ ఇస్తూ వెళ్లారు. దాంతో రాఘవేంద్రరావు సినిమాల్లో కథ ఉంటుంది .. అది కలర్ గా ఉంటుందనే పేరు వచ్చేసింది. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ గా మారిపోయింది. దర్శకులలోనే ఆయనను ఇంద్రుడిని చేసేసింది.

రాఘవేంద్రరావు దర్శకుడిగా తెలుగు సినిమా మార్పును చూస్తూ .. తాను కొంత కారణమవుతూ వచ్చారు. తన వ్యక్తిగత జీవితంలోను .. సినిమా ప్రయాణంలోని సంగతులను ఆవిష్కరిస్తూ ఆయన 'నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ' అనే బుక్ రాశారు. ఫారిన్లో ఆటోబయోగ్రఫీలు రాసే అలవాటు ఎక్కువ. వాళ్లతో పోల్చుకుంటే మన దగ్గర ఆ అలవాటు చాలా తక్కువనే చెప్పాలి. సినిమాకి సంబంధించినవారి విషయానికి వస్తే ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కూడా ఆటోబయోగ్రఫీలపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. కానీ రాఘవేంద్రరావు మాత్రం అందుకు పూనుకోవడం విశేషం.

చేతన్ భగత్ బుక్స్ విషయానికి వస్తే 150 రూపాయల నుంచి 200 వరకూ ధర ఉంటుంది. అబ్దుల్ కలాం బయోగ్రఫీ ధర 200 రూపాయలు ఉంటుంది. ఇక సానియా మీర్జా ఆటో బయోగ్రఫీ 300 వరకూ ఉంది. కానీ రాఘవేంద్రరావు ఆటోబయోగ్రఫి ధర మాత్రం 3 వేలు కావడం ఆశ్చర్యపరుస్తుంది.

ఈ రోజుల్లో పుస్తకాలు కొని చదివే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అలాంటిది ఆయన ఇంత ధరపెట్టడం షాక్ ఇస్తోంది. అంత రేటు పెట్టి కొనేంత ఈ పుస్తకంలో ఏవుందబ్బా? అని అంతా అనుకుంటున్నారు. లోపల 'కొంచెం తీపి .. కొంచెం కారం .. కొంచెం పులుపు' ఉంటుందని మాత్రమే ఆయన హింట్ ఇచ్చాడు. ఇన్నేసి సినిమాలు తీసిన దర్శకుడు అన్ని విషయాలు ముందుగానే చెప్పేస్తాడా ఏంటి?!