Begin typing your search above and press return to search.

‘క్రాక్’ సంక్రాంతి ఫుల్ మీల్స్ : రవితేజ

By:  Tupaki Desk   |   5 Jan 2021 4:15 PM GMT
‘క్రాక్’ సంక్రాంతి ఫుల్ మీల్స్ : రవితేజ
X
తన లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఈ సంక్రాంతి పండుగకు ఫుల్ మీల్స్ ఎంటర్ టైనర్ కాబోతోందని అన్నారు మాస్ మహరాజ్ రవితేజ. పొంగల్ బరిలో నిలిచిన ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రవితేజ.. తన సినిమా విశేషాలు, సినీ పరిశ్రమపై కరోనా ప్రభావం తదితర అంశాలు పంచుకున్నారు.

“మా చిత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ అందిస్తుంది. ట్రైలర్ లో ఒకవైపే చూపించాం.. థియేటర్లో రెండో యాంగిల్ ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేవలం యాభై శాతం సీటింగ్ కెపాసిటీతోనే థియేటర్లు రన్ అవుతున్నాయి. అయినప్పటికీ.. ‘క్రాక్’ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. ఈ పండక్కి అందరూ థియేటర్ కు రావాలి. అయితే.. ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి. అంతేకాకుండా.. ఒక చిన్న సైజు శానిటైజర్ బాటిల్‌ను కూడా వెంట తీసుకెళ్లాలని కోరుతున్నాను”అని రవితేజ అన్నారు.

‘క్రాక్’ తమిళ చిత్రానికి రీమేక్ అన్న పుకార్లను మాస్ రాజా కొట్టిపారేశాడు. ఈ చిత్రం యథార్థ సంఘటనల ఆధారంగా ప్రేరణ పొందిందని, దర్శకుడు గోపీచంద్ మలినేని ఒరిజినల్ స్క్రిప్ట్‌ను అభివృద్ధి చేశారని చెప్పారు. “నా పాత్ర మొదటి నుండి చివరి వరకు చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ట్రైలర్‌లో సీరియస్ సైడ్ మాత్రమే చూపించాం. కానీ.. వెండితెరపై చాలా సరదాగా ఉంటుంది” అని రవితేజ అన్నారు.

ఈ సినిమా ద్వారా దర్శకుడు గోపీచంద్‌తో హ్యాట్రిక్ పూర్తి చేశారు రవితేజ. ఈ అనుభవం గురించి అడగ్గా.. ‘‘పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల తర్వాత నేను ఎక్కువగా పనిచేసింది గోపితోనే. అయితే.. మేము ప్రత్యేకంగా ప్లాన్ చేసి సినిమాలు చేసిందేమీ లేదు. అలా కాలం కలిసొచ్చింది. మేం మళ్ళీ కలిసి పని చేయవచ్చు. ఎవరికి తెలుసు?’’ అని అన్నారు.

ఇక తన కుమారుడు మహాధన్ సినిమా ఎంట్రీ గురించి అడగ్గా.. తను ఇప్పుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడన్న రవితేజ.. సినిమాల్లోకి రావడానికి చాలా తొందరగానే ఉన్నాడని నవ్వేశారు. ఈ తరం పిల్లలు చాలా వేగంగా ఉన్నారన్న మాస్ మహరాజ్.. ఏం చేయాలో? ఏం చేయకూడదో వారికి క్లారిటీ ఉంటోందని చెప్పుకొచ్చాడు.