Begin typing your search above and press return to search.

'కొండ పొలం' కథలో నాయిక లేదు .. రకుల్ పాత్ర నేను క్రియేట్ చేసిందే!: క్రిష్

By:  Tupaki Desk   |   5 Oct 2021 2:30 PM GMT
కొండ పొలం కథలో నాయిక లేదు .. రకుల్ పాత్ర నేను క్రియేట్ చేసిందే!: క్రిష్
X
'కొండ పొలం' .. అనే మాట రాయలసీమలో ఎక్కువగా వినిపిస్తుంది. కరవు కాటకాల సమయంలో అక్కడివారు, పశువులను కాపాడుకోవడం కోసం 'కొండ పొలం' చేస్తుంటారు. అక్కడ పెరిగే పచ్చికతో వాటి పోషణ జరిగేలా చూస్తారు. కరవు కాటకాలు ఏర్పడినప్పుడు అక్కడివారి పరిస్థితి ఎలా ఉంటుంది? మనుగడ కోసం వాళ్లు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? తప్పనిసరి పరిస్థిలోతుల్లో వాళ్లు ఏం చేస్తారు?వంటి అంశాలతో సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన పుస్తకమే 'కొండ పొలం'.

ఈ పుస్తకం ఆధారంగానే దర్శకుడు క్రిష్ ఈ సినిమా చేశాడు. నిజానికి పవన్ తో 'హరి హర వీరమల్లు' సినిమా చేయడానికి క్రిష్ రంగంలోకి దిగాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ఎ.ఎం. రత్నం ముందుకు వచ్చాడు. కథకి తగిన విధంగా భారీ సెట్లు వేయిస్తూ షూటింగును మొదలుపెట్టేశారు. అయితే అదే సమయంలో కరోనా కారణంగా లాక్ డౌన్ పడింది. పవన్ తో చేస్తున్న సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ సమయంలో అడవి నేపథ్యంలోని కథను ఎంచుకోవడమే క్రిష్ చేసిన తెలివైన పని. అందువలన ఆయనకి సమయం వృథాకాలేదు.

'కొండ పొలం' కథ పట్టుకుని .. ముఖ్యమైన పాత్రధారులను తీసుకుని ఆయన లొకేషన్ కి చేరుకున్నారు. తక్కువ సిబ్బందితో షూటింగును మొదలుపెట్టేశారు. కరోనా గురించిన మాటలు వినిపించని చోటుకీ .. కరోనా గురించిన ఆలోచనలు రాని చోటుకి వెళ్లి అందరూ అక్కడే మకాం పెట్టేశారు. సరదాగా ఒక పిక్ నిక్ కి వెళ్లినట్టుగా 45 రోజుల్లో షూటింగు పార్టును పూర్తిచేశారు. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమా నిర్మాణం పూర్తికావడం విశేషం. ఈ విషయంలో క్రిష్ ప్లానింగును అభినందించనివారు లేరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి కథలు ఎంచువాలనే ఒక ఆలోచనను క్రిష్ రేకెత్తించాడు.

వైష్ణవ్ తేజ్ - రకుల్ నాయకా నాయికలుగా నటించిన సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో క్రిష్ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 'కొండ పొలం' కథ నాకు ఎంతగానో నచ్చింది. కానీ అందులో నాయిక పాత్ర లేదు. నాయిక పాత్రను జోడించి ఒక అందమైన ప్రేమకథను అల్లితే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఆ విషయాన్ని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో మాట్లాడాను. ఈ కథలో నాయిక పాత్ర ఉంటే మరింత బాగుంటుందని చెప్పాను.

అందుకు ఆయన అంగీకరించి, నాయిక పాత్రను డిజైన్ చేయడంలో నాకు ఎంతో సహకరించారు. కథలో రకుల్ పాత్రను కొత్తగా క్రియేట్ చేసిన విషయాన్ని ఎవరూ గ్రహించలేరు. అంతగా ఆ పాత్రను కథలోకి ప్రవేశపెట్టాము. ఇక ఈ పాత్రకి రకుల్ అయితే బాగుంటుందని అనుకున్నాను. ఇంతవరకూ మోడ్రన్ పాత్రలను చేస్తూ వచ్చిన రకుల్, ఈ పాత్రలో ఒదిగిపోయింది. ఆ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనేంతగా జీవించింది. ఇక ఈ సినిమాను 'గోవా' పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాము. అయితే కథలో గొర్రెలపై పులి దాడి చేసే సీన్ ఉండటంతో అనుమతులు రాలేదు. దాంతో 'వికారాబాద్' అడవుల్లోనే చాలావరకూ షూటింగ్ చేశాము" అని చెప్పుకొచ్చారు.