Begin typing your search above and press return to search.

ఈ క్రిష్ కు ఎంత ధైర్యం?

By:  Tupaki Desk   |   22 Oct 2015 4:43 PM GMT
ఈ క్రిష్ కు ఎంత ధైర్యం?
X
ఒక సినిమా అనుభవమున్న హీరో. అతడికేమీ మాస్ ఇమేజ్ లేదు, క్రౌడ్ పుల్లర్ కాదు. తన ఆలోచనలకు తగ్గట్లు భారీ బడ్జెట్ లేదు. అసలు బయటి నిర్మాతలెవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు. తన గత రెండు సినిమాలూ కమర్షియల్ ఫెయిల్యూర్స్. తాను సినిమా చేసి రెండేళ్లయింది. ఇలాంటి నేపథ్యంలో సినిమా తీస్తూ ఎవరైనా ఓ సేఫ్ మూవ్ వేయడానికి చూస్తారు. తన కథకు ఎంతో కొంత కమర్షియల్ టచ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సినిమాకు మసాలా అద్దడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్రిష్ మాత్రం అలా చేయలేదు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ ప్రేమకథను తీయాలనుకోవడమే సాహసమంటే.. ఇక దానికి ఓ విషాదకరమైన ముగింపు ఇవ్వాలనుకోవడం ఇంకా పెద్ద సాహసం.

తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ని చంపేస్తేనే ఒప్పుకోరు. అలాంటిది క్రిష్ హీరోను కూడా చంపేసి సినిమాకు విషాదకర ముగింపు ఇచ్చారు. కానీ కథలో దమ్ముండాలి, ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేయాలే కానీ.. ఎలాంటి ముగింపునైనా స్వీకరిస్తారని క్రిష్ చాటి చెప్పాడు. తాను ఏం నమ్మాడో అదే తీశాడు. సినిమాలో ఎక్కడా కమర్షియల్ లెక్కలు వేసుకోలేదు. కథ నుంచి ఎక్కడా పక్కకు జరగలేదు. నిజానికి గతంలో ఇలాంటి చారిత్రక నేపథ్యంతో వచ్చిన సినిమాలు చూస్తే అందులోనూ ఏవో కామెడీ ట్రాకులు ఇరికించడం.. ఓ మసాలా పెట్టే ప్రయత్నం చేయడం జరిగాయి. కానీ క్రిష్ మాత్రం అలాంటి అర్థరహితమైన విషయాల జోలికి పోలేదు. మొత్తం కథ మీదే దృష్టిపెట్టాడు. నిజాయితీగా ఓ కథను చెప్పే ప్రయత్నం చేశాడు. రూ.20 కోట్ల బడ్జెట్ పెట్టి సొంతంగా సినిమా చేస్తూ ఇంత పెద్ద రిస్క్ చేయగలగడం అసాధారణ విషయం. సినిమా పట్ల ప్యాషన్, ప్రేక్షకుల మీద గౌరవం ఉన్న వాళ్లు మాత్రమే ఇలాంటి సినిమా తీయగలరు. అందుకతడికి సెల్యూట్ చేయాల్సిందే.