Begin typing your search above and press return to search.

చదివితే రక్తం మరిగింది -క్రిష్

By:  Tupaki Desk   |   27 Dec 2016 4:28 AM GMT
చదివితే రక్తం మరిగింది -క్రిష్
X
బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం ఆడియో వేడుకలో.. ఈ సినిమా తీయాలనే ఆలోచన వెనక ఉన్న కథ వివరించాడు క్రిష్. ముందుగా.. 'అంజనాపుత్ర క్రిష్ అని నా పేరు కంటే నీ పేరు వేశానమ్మా.. నీ పేరు నిలబెడతా. అలాగే పెళ్లయిన తర్వాత పట్టుమని 10 రోజులు కూడా గడపకుండా.. సినిమా పనులు చేశాను. పద్మావతి పుత్రిక రమ్యా.. నువ్వు నేను గర్వపడే సినిమా తీశాను. నా లైఫ్ లోకి వచ్చినందుకు థాంక్యూ.. ఐలవ్యూ' అంటూ తన భార్యకు ప్రేమను వ్యక్తపరిచిన క్రిష్.. తల్లికి అభివందనం చేశాడు.

'శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ కొన్ని శాసనాల ద్వారా చరిత్ర రాయించారు. చంద్రబాబు గారు లండన్ వెళ్లినపుడు.. లండన్ లో ఒక మ్యూజియంలో.. అమరావతి శిథిలాలు ఉన్నాయని చెప్పారు. కొన్ని శిథిలాలు తెస్తానన్నారు. మనకు తెలియని మన సంస్కృతి.. మన సంప్రదాయం.. ఎక్కడో లండన్ వాళ్లు గుర్తిస్తున్నారు. సివిల్స్.. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే పుస్తకాల్లోంచి 35 పేజీల డేటా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి దొరికింది. అక్కడ మొదలుపెట్టాను. ఏం లేదే అని మొదలుపెడితే.. వీఎన్ శాస్త్రి.. విశ్వనాథ సత్యనారాయణ.. చాలా విషయాలే చెప్పారు.' అన్నాడు దర్శకుడు.

'మహరాష్ట్రకు చెందిన వ్యక్తికి శాతకర్ణి సినిమా తీస్తున్నానని చెబితే.. మహరాష్ట్రపై సినిమా తీస్తున్నావా అని అడిగాడు. తెలుగు వ్యక్తి సినిమా తీస్తున్నానని అంటే.. ''ఛత్రపతి శివాజీకి తల్లి జిజియా బాయ్.. నువ్వు గౌతమిపుత్ర శాతకర్ణి అంత గొప్పవాడివి కావాలని చెప్పేది" అన్నాడు. అంటే మహరాష్ట్ర వాళ్లు కూడా పూజించుకుంటున్నారు కానీ.. మనకు చేత కావడం లేదు. తమిళ్ లో శాతకర్ణిని నూట్రవర్ కన్నర్ అంటారు. తమిళ్ ప్రజలు కూడా ఆయన్ను కీర్తిస్తున్నారు. మనకు మాత్రం తెలీదు' అన్నాడు క్రిష్.

'మరింత సమాచారం మెగస్తనీస్ ఇండికాలో దొరికింది. గ్రీస్ నుంచి పాశ్చాత్యుడు దగ్గర ఉన్న సమాచారం.. మన దగ్గర లేదు. ఆయన గురించి చదువుతుంటే రక్తం మరిగింది' అంటూ.. శాతకర్ణి చిత్రం తీయాలనే ఆలోచన వెనక అసలు కథ వివరించాడు క్రిష్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/