Begin typing your search above and press return to search.

కమెడియన్‌ అంటే అంత వీజీ కాదు

By:  Tupaki Desk   |   19 Oct 2015 3:57 AM GMT
కమెడియన్‌ అంటే అంత వీజీ కాదు
X
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కమెడియన్స్ తీరు వేరు. ఇప్పుడు కమెడియన్స్.. హీరోల కంటే ఎక్కువ పంచ్ లు, డైలాగ్స్ వేసేస్తున్నారు. కొన్నిసార్లు స్టార్ల సినిమాలకూ బ్యాక్ బోన్ గా నిలిచే స్థాయికి కామెడీ కేరక్టర్ ఆర్టిసులు ఎదిగిపోయారు. మాటలతో చురకలు వేస్తూ.. స్క్రీన్ పై ఉన్నంతసేపూ ఆకట్టుకునే కమెడియన్ కృష్ణ భగవాన్. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు - కబడ్డీ కబడ్డీల తర్వాత ఈయన స్టేటస్ మారిపోయింది. పేరుకు కమెడియన్స్ అయినా.. సినిమాల్లోని ప్రధాన పాత్రధారులతో సమానంగా కష్టపడతామని, ఒక్కోసారి ఫన్నీ సీన్స్ కోసం రిస్కీ ఫీట్స్ చేయాల్సి వచ్చేదని చెబ్తున్నాడు కృష్ణ భగవాన్.

జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీ కోసం లడఖ్ ప్రాంతంలో షూటింగ్ చేసినపుడు చాలా ఇబ్బందులు పడ్డారట. సముద్ర మట్టానికి చాలా ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఊపిరి కూడా సరిగా ఆడలేదట. ఓ సీన్ షూటింగ్ సమయంలో గాలి సరిగా ఆడక.. హీరోయిన్ స్నేహితురాళ్లుగా చేసినవాళ్లందరూ స్పృహ తప్పి పడిపోయారంటున్నాడు భగవాన్. 40కిలోమీటర్లు కిందకు దిగొచ్చాక గానీ.. గుండెల నిండా ఊపిరి పీల్చుకోలేకపోయామంటున్నాడు. రాజేంద్ర ప్రసాద్ - డైరెక్టర్ వంశీ కాంబినేషన్ లో వచ్చిన ఏప్రిల్‌ 1 విడుదల సినిమాలో.. వీడియో షాపు ఓపెనింగ్‌ సన్నివేశం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి.. ఓ ఆర్టిస్ట్ కాలు విరిగిందట. రియల్‌ దుంగను సరిగానే కట్‌ చేసి.. అది కింద పడే టైమింగ్‌ కాస్త లేట్‌ అవడంతో.. ఒక ముక్క కాళ్ళ మీద పడ్డంతో కాలు విరిగిపోయిందని చెప్పాడు కృష్ణ భగవాన్.

వంశీ డైరెక్షన్ లో వచ్చిన మరో సినిమ దొంగరాముడు అండ్ పార్టీ షూటింగ్ లో కొబ్బరి చెట్టెక్కాల్సి వచ్చిందట. జీవాని చెట్టెక్కించి పొజిషన్‌ లో ఉంచి - కృష్ణ భగవాన్ ని కూడా ఎక్కమన్నారట. అలా చెట్టు పైనే ఉంచి అడ్రస్ అడగడం, సందుగొందులతో సహా డీటైల్స్ చెప్పే సీన్ చేశారట. అంతెత్తు ఉండే చెట్టుపై బెల్టులతో నిలబడడమే కష్టమైతే... అంతసేపు మాట్లాడుకోవాల్సి రావడంతో ఇంకా వణుకొచ్చేసిందట ఇద్దరికీ. అయినా సరే కామెడీ పండడం కోసం కష్టపడి చేశామంటున్నాడు కృష్ణభగవాన్. ఏదేమైనా కమెడియన్‌ అంటే అంత వీజీ కాదు.