Begin typing your search above and press return to search.

2400 అభిమాన సంఘాలు ఉన్న ఏకైక హీరో కృష్ణ..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 5:45 AM GMT
2400 అభిమాన సంఘాలు ఉన్న ఏకైక హీరో కృష్ణ..!
X
తేనే మనసులు సినిమాతో లీడ్ రోల్ లో నటించిన తొలి సినిమానే సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ కృష్ణ మూడవ సినిమా గూఢచారి 116 తోనే మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తెలుగు తెర మీద మొదటి స్పై థ్రిల్లర్, కౌ బోయ్ సినిమాలను పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కే దక్కింది.

ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రయోగానికి నాంది పలకడం ఆయనకు అలవాటు. అదే ఆయన్ని ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ తర్వాత తన సినిమాలతో ఆ రేంజ్ అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణ. 1964 నుంచి మొదలైన ఆయన సినీ ప్రస్థానం నాలుగు దశాబ్ధాలుగా సాగింది.

హీరోకి అభిమాన సంఘాలు ఉంటాయి.. అయితే సూపర్ స్టార్ కృష్ణ రాష్ట్రం మొత్తం మీద 2400 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇది తెలుగు హీరోలకి ఎవరికీ సాధ్యం కాని రికార్డ్. ఇదే కాదు సూపర్ స్టార్ కృష్ణ ఖాతాలో చాలా రికార్డులు ఉన్నాయి.

ఏడాదికి 18 సినిమాలకు పైగా చేసిన హీరోగా మరే హీరోకి సాధ్యం కాని రికార్డ్ తన సొంతం చేసుకున్నారు కృష్ణ. తన కెరియర్ లో కృష్ణ దాదాపు 80 మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు. అత్యధికంగా విజయ నిర్మల తో ఆయన 50 సినిమాలు చేశారు. కృష్ణ తో విజయ నిర్మల తర్వాత జయప్రద 43 సినిమాలు చేశారు. శ్రీదేవి కృష్ణ కాంబినేషన్ లో 31 సినిమాలు వచ్చాయి.

సూపర్ స్టార్ కృష్ణ డైరక్టర్ గా 16 సినిమాలు చేశారు. తన కెరీర్ మొత్తం మీద 105 మంది దర్శకులతో పనిచేశారు కృష్ణ. భారీ సినిమాలు చేసే టైం లో ఎంతమంది తనని హెచ్చరించినా సరే సాహసమే తన ఊపిరి అన్నట్టుగా ముందుకు సాగారు ఆయన. అందుకే తెలుగు పరిశ్రమలో కొన్ని తొలి ప్రయత్నాలకు ఆయన పేరు ఎప్పటికీ ప్రస్తావించబడుతుంది. ఎలాంటి సినిమా అయినా తీయగలను.. తీస్తాను అనే డేరింగ్ ఆయన్ని సూపర్ స్టార్ గా చేసింది. సినిమాలతో పోటీ పడినా పరిశ్రమలో ఓ మంచి మనిషిగా తన సాటి హీరోలతో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండే వారు కృష్ణ.

సినిమా నిర్మాత బాగుండాలని కోరుకునే వారిలో కృష్ణ గారు ఒకరు. అందుకే ఆశించిన స్థాయిలో సినిమా ఆడకపోయినా నిర్మాతలని రెమ్యునరేషన్ కోసం బలవంతం పెట్టేవారు కాదు. అంతేకాదు సినిమా పోతే అదే నిర్మాతకి మరో సినిమా చేసి పెట్టేవారు. ఇలాంటివి కృష్ణ గారి కెరియర్ లో ఎన్నో ఉన్నాయి. ఆయనంత మంచి మనిషి కాబట్టే ఇన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.