Begin typing your search above and press return to search.

కృష్ణ లైఫ్ లో బయోపిక్ కు సరిపడే ఎమోషన్స్ - డ్రామా ఉన్నాయా..?

By:  Tupaki Desk   |   18 Nov 2022 6:30 AM GMT
కృష్ణ లైఫ్ లో బయోపిక్ కు సరిపడే ఎమోషన్స్ - డ్రామా ఉన్నాయా..?
X
దిగ్గజ నటుడు, నటశేఖర కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ అంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ గా పిలవబడే సూపర్ స్టార్ మరణాన్ని సినీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన సినిమాలు మరియు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలతో చిరస్థాయిగా నిలిచిపోతారని మనసుని స్థిమిత పరుచుకుంటున్నారు.

ఒక లెజెండరీ సెలబ్రిటీ కాలం చేసిన ప్రతిసారీ, వారి బయోపిక్ తీయడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంటాయి. అప్పటికే అనేకమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత చరిత్రలను బియోపిక్స్ గా వెండి తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

ఘట్టమనేని కృష్ణ జీవితాన్ని పరిశీలిస్తే.. నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా కృష్ణ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచారు. సినీ రంగంలోనే కాకుండా ఎంపీగా గెలిచి, రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించారు.

సినీ రంగ ప్రవేశం నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగడం - నిర్మాతల హీరో అనిపించుకోవడం - సొంతంగా బ్యానర్ ను స్థాపించి సినిమాలు నిర్మించడం - ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీలను పరిచయం చేయడం - పద్మాలయ స్టూడియో నిర్మాణం - రాజకీయ జీవితం - వ్యక్తిగత జీవితం - విజయ నిర్మలతో రెండో పెళ్లి - తన కుమారుడు మహేశ్ బాబును హీరోగా నిలబెట్టడం వరకు కృష్ణ లైఫ్ లో ఎన్నో విశేషాలు ఉన్నాయి.

అయితే ఇవన్నీ ఒక బయోపిక్ లేదా వెబ్ సిరీస్ తీయడానికి సరిపోతాయా అనేది ఆలోచించాలి. ఎవరి జీవితాన్నైనా తెర మీదకు బయోపిక్ గా తీసుకురావాలంటే.. వారి లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఉండాలి.. ఎమోషన్స్ ఉండాలి. అవన్నీ ఉంటేనే డ్రామా పండుతుంది.

అంతేకాదు బయోపిక్ అంటే ఖచ్చితంగా వారి సక్సెస్ ఫుల్ జీవితంలోని సానుకూల వైపు మాత్రమే కాకుండా.. ప్రతికూలత మరియు ఎవరికీ తెలియని కోణాన్ని కూడా ఆవిష్కరించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఆ సినిమా నిజాయితీగా అనిపించదు.

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "మహానటి" సినిమాలో అవన్నీ ఉన్నాయి కాబట్టే.. ఆ బయోపిక్ ప్రేక్షకాదరణ పొంది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే సమయంలో దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ "తలైవి" నిరాశ పరించింది.

అలానే రెండు భాగాలుగా తెరకెక్కించిన నందమూరి తారక రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్ కథానయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రాలు డిజాస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కృష్ణ బయోపిక్ చేయాలని భావిస్తే.. వీటిని దృష్టిలో పెట్టుకొని కథా కథనాలను రాసుకోవాలి.

ఇకపోతే కృష్ణ గుర్తులను పదిలంగా భద్రపరుచుకునేందుకు మహేశ్ బాబు మరియు ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ మెమోరియల్ ని ఏర్పాటు చేసి, ఆయనకు సంబంధించిన గుర్తులన్నింటినీ పొందుపరుస్తారని అంటున్నారు.

పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని టాక్. కృష్ణ నటించిన 350కి పైగా సినిమాల విశేషాలు.. ఫోటోలు - అవార్డులతో పాటుగా కాంస్య విగ్రహం కూడా ఉంచుతారని అంటున్నారు. సూపర్ స్టార్ జీవితం అతి పెద్ద సినీ మ్యూజియం అంటుంటారు. అందులోని మధురానుభూతులు - ఆసక్తికరమైన అంశాలను ఈ మెమోరియల్ ద్వారా తెలుసుకునే అవకాశం అందరికీ కలిగిస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.