Begin typing your search above and press return to search.

‘నక్షత్రం’ కోసం వాళ్లందరూ ఫ్రీగా చేశారట

By:  Tupaki Desk   |   30 July 2017 8:01 AM GMT
‘నక్షత్రం’ కోసం వాళ్లందరూ ఫ్రీగా చేశారట
X
కృష్ణవంశీ.. ఈ పేరు చూసి థియేటర్లకు పరుగెత్తుకొచ్చేసేవాళ్లు ప్రేక్షకులు ఒకప్పుడు. కానీ గత దశాబ్ద కాలంలో ఈ పేరుకున్న ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ‘గోవిందుడు అందరివాడేలే’తోనూ నిరాశపరిచాడు. ఈ సినిమా తర్వాత సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ సినిమా మొదలుపెడితే.. అది పూర్తవడానికి.. విడుదలకు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టేసింది. ఇప్పటికైనా ఈ సినిమా పూర్తయి విడుదలకు రెడీ అవుతోందంటే.. అది కృష్ణవంశీ కోసం చాలామంది ఉచితంగా పని చేయడం వల్లేనట. ఈ సినిమా కోసం ఫ్రీగా పని చేసిన వాళ్ల లిస్టు పెద్దగానే ఉందంటున్నాడు కృష్ణవంశీ.

‘నక్షత్రం’ నిర్మాతలకు తాను చెప్పిన బడ్జెట్ కంటే కూడా అదనంగా 30 శాతం ఎక్కువ ఖర్చు పెట్టించాడట కృష్ణవంశీ. అప్పటికీ ప్రకాష్ రాజ్.. సాయిధరమ్ తేజ్.. జేడీ చక్రవర్తి.. శివాజీ రాజా.. రఘుబాబు.. తనీష్.. వీళ్లెవ్వరూ కూడా పారితోషకం తీసుకోలేదట. ‘‘కొంతమందిని బతిమాలి.. కొంతమందిపై దౌర్జన్యం చేసి ఈ సినిమాకు ఉచితంగా పని చేసేలా ఒప్పించా. ప్రకాష్ రాజ్ తో ‘ఒరేయ్.. నా దగ్గర డబ్బు లేదు. కానీ నా సినిమాకు నువ్వు కావాలి. చేస్తావా చెయ్యవా’ అని అడిగాను. ‘నువ్వు అలా అంటే ఏం చేస్తాం. షూటింగుకి వస్తున్నా’ అంటూ వచ్చేశాడు. సాయిధరమ్ తో కూడా ‘నిన్ను భరించే శక్తి నాకు లేదు’ అని అంటే.. మన మధ్య డబ్బు ప్రస్తావన ఎందుకు సార్ అనేసి షూటింగుకి వచ్చాడు. మిగతా వాళ్లు కూడా ఇలాగే సహకరించారు. వాళ్లందరితో పాటు నేను కూడా ఈ సినిమాకు పారితోషకం తీసుకోలేదు’’ అని కృష్ణవంశీ తెలిపాడు. సినిమా మధ్యలో ఉండగా వచ్చిన డీమానిటైజేషన్ దెబ్బకు తాము ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్లు కృష్ణవంశీ చెప్పాడు. ఈ సినిమా టైటిళ్లలో కనిపిస్తున్న ‘శ్రీ చక్ర మీడియా’ బేనర్ తనదేనని కృష్ణవంశీ చెప్పడం చూస్తే.. ఈ సినిమాలో ఆయన సొంత డబ్బులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.