Begin typing your search above and press return to search.

కుదిరితే కృతిశెట్టి .. లేదంటే 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ!

By:  Tupaki Desk   |   30 Dec 2020 11:30 PM GMT
కుదిరితే కృతిశెట్టి .. లేదంటే గ్యాంగ్ లీడర్ బ్యూటీ!
X
చూస్తుంటే వచ్చే ఏడాదిలో కృతి శెట్టి .. ప్రియాంక అరుళ్ మోహన్ జోరు ఒక రేంజ్ లో ఉండేట్టుగా కనిపిస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ 'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కృతిశెట్టి హీరోయిన్ గా చేసిన 'ఉప్పెన' సినిమా ఇంకా థియేటర్లకే రాలేదు. ఇంతవరకూ ప్రియాంక ఒక సినిమాలో మాత్రమే కనిపించగా, కృతి శెట్టి బొమ్మ ఇంకా తెరపై పడనే లేదు. అలాంటి ఈ ఇద్దరిపైనే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా దృష్టి పెట్టడం విశేషం. అప్పుడే కురిసిన వాన చినుకుల్లాగా తేటగా .. స్వచ్ఛంగా కనిపించే ఈ ముద్దుగుమ్మలపైనే కుర్రాళ్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా చూసినవాళ్లు .. ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించగానే ఈ పిల్ల భలేగా ఉందే అనుకున్నారు. ఇంత సుకుమారమైన అమ్మాయిని ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్పుకున్నారు. పల్చని పంచదార చిలకలా కనిపించిన ఈ అమ్మాయికి కలలను అంకితం చేశారు .. చూపుల నైవేద్యాలు పెట్టేశారు. యూత్ లో ఈ అమ్మాయికి క్రేజ్ పెరగడంతో, వెంటనే శర్వానంద్ జోడీగా 'శ్రీకారం'లో అవకాశం లభించింది. ఈ సినిమా లిరికల్ వీడియోల్లో అమ్మాయి గ్లామర్ కి మరిన్ని మార్కులే పడ్డాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయికి, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న 'థ్యాంక్యూ' సినిమాలో అవకాశం దక్కింది. చైతూ హీరోగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక కృతిశెట్టి కథ వేరు .. తొలి సినిమా విడుదలకి ముందే ఇంతగా కుర్రమనసులను దోచేసిన హీరోయిన్ ఈ మధ్యకాలంలో లేదనే చెప్పాలి. 'ఉప్పెన' సినిమాతో ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అందమైన రూపం .. ఆకట్టుకునే కళ్లు .. సొట్ట బుగ్గలతో ఆకర్షించే నవ్వు ఈ అమ్మాయి ప్రత్యేకత. ఈ అమ్మాయి ఇప్పుడు కుర్రాళ్ల హృదయాల్లో ఊహల ఉప్పెనగా మారిపోయింది. దాంతో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. ప్రస్తుతానికి ఆమె నానీ జోడీగా 'శ్యామ్ సింగ రాయ్' మాత్రం అంగీకరించింది. మిగతా కుర్రహీరోలంతా ఆమె డేట్స్ కోసం ట్రై చేయమని దర్శక నిర్మాతలను వత్తిడి చేస్తున్నారట. కుదిరితే కృతి శెట్టి .. లేదంటే ప్రియాంక అరుళ్ మోహన్ ను ఖాయం చేయమని చెబుతున్నారట. చూస్తుంటే కొత్త ఏడాదిలో తెలుగు తెర ఈ బుట్టబొమ్మల బృందావనంలా మారేట్టుగానే కనిపిస్తోంది కదూ .. !