Begin typing your search above and press return to search.

అందానికి అదృష్టం తోడైతే పారితోషికం పరుగులు తీయకుండా ఉంటుందా?

By:  Tupaki Desk   |   16 Oct 2021 2:42 PM GMT
అందానికి అదృష్టం తోడైతే పారితోషికం పరుగులు తీయకుండా ఉంటుందా?
X
ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి కృతి శెట్టి వంటి అందమైన కథానాయిక పరిచయం కాలేదనే చెప్పాలి. తెలుగు తెరపై కృతి అందాల హంసలా వచ్చి వాలింది .. సౌందర్య జలపాతమై తాకింది. ఆ కళ్లలోని మెరుపు చూస్తే నక్షత్రాలు చిన్నబుచ్చుకుంటాయి. ఆ తేనె చెక్కిళ్లపై చిందే నవ్వులను చూస్తే వేల పున్నమిలు వెల వెల బోతాయి. దానిమ్మ మొగ్గలాంటి ఈ పిల్ల ఏ పాలవాగులో కొట్టుకొచ్చిందోనని కుర్రాళ్లు మనసులు పారేసుకున్నారు. సొట్ట బుగ్గలతో ఆమె విసిరే చూపులను విసుక్కోకుండా ఏరేసుకుంటూనే ఉన్నారు.

అజంతా శిల్పాలలోని అందమంతా పోగుచేసుకున్నట్టుగా కనిపించే ఈ అమ్మాయికి అదృష్టం కూడా దూరంగా ఉండలేకపోతోంది. అందుకే ఈ అమ్మాయి కొత్తగా రెక్కలొచ్చిన తెల్ల పావురాయిలా అవకాశాల మేఘాల దిశగా దూసుకుపోతోంది. 'ఉప్పెన' సినిమాలో కథాకథనాల సంగతి అటుంచితే, ఈ అమ్మాయి అందాల ధాటిని తట్టుకోవడం వయసులో ఉన్నవాళ్ల వల్ల కాలేదు. అటు క్రేజ్ .. ఇటు డిమాండ్ ఇప్పుడు ఈ అమ్మాయిని సతమతం చేస్తున్నాయి. అందువలన ఈ అమ్మాయి ఎంత పారితోషికం అడుగుతున్నా 'ఓస్ ఇంతేనా' అనేస్తున్నారట.

ప్రస్తుతం ఈ అమ్మాయి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగరాయ్' రెడీ అవుతోంది. ఇక సుధీర్ బాబు సరసన చేస్తున్న సినిమా .. రామ్ జోడీగా చేస్తున్న సినిమా సెట్స్ పైనే ఉన్నాయి. ఇక ఇటీవలే 'బంగార్రాజు' సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. ఒక్కో సినిమాకి పారితోషికం పెంచేస్తున్న ఈ అమ్మాయి, యాడ్స్ విషయంలోను ఎంతమాత్రం తగ్గడం లేదట. ఒక జ్యూయలరీ షాప్ యాడ్ లో నటించినందుకు ఈ పిల్ల పారితోషికంగా 25 లక్షలు తీసుకుందని చెప్పుకుంటున్నారు. ఆ యాడ్ లో వంటి నిండా నగలతో మెరిసిపోయే ఈ అమ్మడిని చూస్తే, మరో పాతిక ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది.

ఇక ఇప్పటికే చాలా సంస్థలు ఈ సుందరితో వాణిజ్య ప్రకటనలు చేయించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాయట. ఆ విషయంలో కూడా ఈ అమ్మాయి తెలివిగానే వ్యవహరిస్తోందని అంటున్నారు. మరికొన్నాళ్లలో చాలా యాడ్స్ లో ఈ అమ్మాయి సందడి కనిపించడం ఖాయమని అంటున్నారు. తెలుగులో అవకాశాల జోరు అలా ఉంచితే, తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల నుంచి కూడా అమ్మడికి అవకాశాలు పొలోమంటూ వచ్చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అందానికి అదృష్టం తోడైతే ఆపడం కష్టమే! అందగత్తెలకి ఇచ్చే పారితోషికం ఎక్కువని చెప్పడం అంతకంటే కష్టమే!!