Begin typing your search above and press return to search.

కాలేజ్ రోజుల్లో నేను కూడా 'తొలిప్రేమ' చూసినవాడినే: కేటీఆర్

By:  Tupaki Desk   |   23 Feb 2022 6:35 PM GMT
కాలేజ్ రోజుల్లో నేను కూడా తొలిప్రేమ చూసినవాడినే: కేటీఆర్
X
పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్లో రూపొందిన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా కేటీఆర్ వచ్చారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "చాలా ఓపికగా చాలా సేపటి నుంచి ఇక్కడ కూర్చున్న నా తమ్ముళ్లందరికీ పేరు పేరున హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ఈ రోజున ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన సోదరులు .. మీ అందరి అభిమాన నాయకుడు .. పవన్ కల్యాణ్ గారి కోసమే వచ్చాను. చిరంజీవి - చరణ్ సినిమా ఫంక్షన్ కోసం అనుకుంటాను .. నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్ కి వచ్చాను. స్టేజ్ పై మాట్లాడుతూ యథాలాపంగా తండ్రేమో మెగాస్టార్ .. బాబాయ్ పవర్ స్టార్ అనగానే ఇట్లాగే అరుపులు .. కేకలతో మాట్లాడనివ్వలేదు. ఈ రోజు నేను ఒక మంత్రిగా .. ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రాలేదు. వారి సోదరుడిగా మాత్రమే వచ్చాను.

పవన్ కల్యాణ్ గారు ఒక మంచి మనిషి .. మనసున్న మనిషి. విలక్షణమైన శైలి ఆయన సొంతం. నాకు తెలిసి సూపర్ స్టార్లు చాలామంది ఉంటారు గానీ .. ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణ నటుడు పవన్ కల్యాణ్ గారు. మేమందరం కూడా కాలేజ్ రోజుల్లో ఆయన 'తొలిప్రేమ'ను చూసిన వాళ్లమే. అప్పటి నుంచి ఇప్పటివరకూ .. అంటే ఒక 25 .. 26 ఏళ్లుగా ఇంత స్టార్ డమ్ ను .. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను కొనసాగించడం .. ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అసాధారణమైన విషయంగా చెప్పుకోవాలి .. అందుకు వారికి హృదయపూర్వక అభినందనలు.

ఇందాక శ్రీనివాస యాదవ్ గారు చెప్పింది అక్షర సత్యం. 8 ఏళ్లుగా భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్ ను రూపొందించాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో పురోగమిస్తుందనే విశ్వాసం మాకైతే సంపూర్ణంగా ఉంది. కల్యాణ్ గారి వంటి పెద్దలు అండగా ఉంటే, భారతీయ చలన చిత్ర పరిశ్రమకి హైదరాబాద్ ఒక కేంద్రంగా మారుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఇకపై షూటింగులు గోదావరి జిల్లాల్లోనే కాదు 'మల్లన్న సాగర్' .. 'కొండ పోచమ్మ సాగర్'లో కూడా చేయవచ్చు.

'భీమ్లా నాయక్' సినిమాతో చాలామంది అజ్ఞాత సూర్యులను వెలుగులోకి తీసుకుని వచ్చిఅందుకు పవన్ కల్యాణ్ గారికి .. త్రివిక్రమ్ గారికి .. సాగర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మొగిలయ్య .. దుర్గవ్వ లాంటి కళాకారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ ముగించారు.