Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: కుందనపు బొమ్మ

By:  Tupaki Desk   |   25 Jun 2016 9:57 AM GMT
మూవీ రివ్యూ: కుందనపు బొమ్మ
X
చిత్రం : ‘కుందనపు బొమ్మ’

నటీనటులు: చాందిని చౌదరి - సుధాకర్ - సుధీర్ వర్మ - నాగినీడు - రాజీవ్ కనకాల - ఝాన్సీ - షకలక శంకర్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: ఎస్.డి.జాన్
నిర్మాతలు: అనిల్ కుమార్ రాజు - వంశీకృష్ణ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వర ముళ్లపూడి

ముళ్లపూడి రమణ దిగ్గజ రచయిత కొడుకు.. బాపు లాంటి దిగ్గజ దర్శకుడి అల్లుడు అయిన వర ముళ్లపూడి తెలుగు పరిశ్రమలో దర్శకుడిగా నిలదొక్కుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో ‘నా అల్లుడు’ ద్వారా దర్శకుడిగా పరిచయమై.. తొలి ప్రయత్నంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వర.. ఆ తర్వాత ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ లాంటి వెరైటీ సినిమాతో తనేంటో రుజువు చేసుకోవాలని చూశాడు. కానీ ఫలితం మారలేదు. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వర ఇప్పుడు ‘కుందనపు బొమ్మ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి మూడో ప్రయత్నంలోనైనా వర నుంచి ఓ మంచి సినిమా వచ్చిందో లేదో చూద్దాం పదండి.

కథ:

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి సుచిత్ర (చాందిని చౌదరి). ఆమె తండ్రి మహదేవ రాజు తన కూతుర్ని మేనల్లుడైన గోపి (సుధాకర్) ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. ఐతే అతడికి సుచిత్రను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఇంట్లోంచి పారిపోతాడు. మరోవైపు సుచిత్రను చూసి తొలి చూపులోనే ఇష్టపడిన వాసు (సుధీర్ వర్మ) ఆమె ఇంటికి కారు రిపేర్ చేయడం కోసమని వచ్చి.. ఆమె మనసు గెలుస్తాడు. ఈ ప్రేమికులిద్దరూ తమ విషయం తండ్రికి చెప్పడానికి గోపి సాయమే అడుగుతారు. మరి అతను తన మావయ్యకు ఈ విషయం చెప్పాడా.. ఇంతకీ గోపి మనసులో ఏముంది.. చివరికి సుచిత్ర-వాసు ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

అలనాటి మేటి దర్శకులు బాపు.. వంశీ.. తమ అసలు శైలికి.. ప్రస్తుత ట్రెండుకు మధ్య ఊసిసలాడుతూ.. కొన్ని సినిమాలు తీశారు. అందులో బాపు తీసిన ‘సుందరకాండ’.. వంశీ తీసిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’.. ‘వెన్నెల్లో హాయ్ హాయ్’ లాంటి కళాఖండాల్ని మళ్లీ చూసుకున్నట్లుగా అనిపిస్తుంది ‘కుందనపు బొమ్మ’ చూస్తుంటే. పూర్తి ఔట్ డేట్ అయిపోయిన కథాకథనాలు.. ఏమాత్రం ఎలివేట్ కాని ఎమోషన్లు.. కృతకంగా అనిపించే కామెడీ.. స్థూలంగా ఇదీ ‘కుందనపు బొమ్మ’ సినిమా.

ముళ్లపూడి వారి అబ్బాయి ఇంతకుముందు తీసిన ‘నా అల్లుడు’.. ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ సినిమాలు చూసి నిరాశ చెందిన వాళ్లు.. ‘కుందనపు బొమ్మ’ చూస్తే.. అంతకుముందు చూసిన రెండు సినిమాలు చాలా గొప్పగా అనిపించే అవకాశముంది. ఆ స్థాయిలో టార్చర్ పెడుతుందీ సినిమా. తాను పరీక్ష రాస్తుండగా సాయం చేశాడని హీరోయిన్.. హీరో ప్రేమలో పడిపోతుంది. ఇలాంటి రీజన్ తో మొదలయ్యే ప్రేమకథ ఇక ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రొమాంటిక్ ట్రాక్ ఇలా ఉంటే ఇక కామెడీ గురించి చెప్పాల్సిన పని లేదు. మొబైల్ మెసేజ్ లు.. వాట్సాపుల్లో ఫార్వర్డ్ అయ్యి అయ్యి అరిగిపోయిన సిల్లీ జోక్స్ ను పెట్టి ఇదే కామెడీ నవ్వుకోండి అంటే ఏం చేయగలం? ఎప్పుడో శంకర్ దాదా సినిమాలో చిరంజీవి వాడి పడేసిన ‘ఇంగ్లిష్ ట్రాన్స్ లేషన్’ కామెడీతో నవ్వించడానికి కూడా చాలా ప్రయత్నమే జరిగింది.

భీభత్సమైన కామెడీ సినిమాగా మలచాలన్న ప్రయత్నంలో భాగంగా సినిమాలోని ప్రతిపాత్రనూ కూడా సిల్లీగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. చివరికి ఎమోషనల్ సీన్స్ కూడా కామెడీగా అనిపించాయంటే సినిమాలోని పాత్రలు.. సన్నివేశాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కారు చుట్టూ అల్లుకున్న సెంటిమెంటు.. డ్రామా అంతా సిల్లీగా అనిపిస్తుంది. తన గత సినిమాలో హీరోగా నటించాడన్న కృతజ్నతతోనో ఏమో కానీ.. ఒక్క రాజీవ్ కనకాల పాత్రను మాత్రం కొంచెం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు వర ముళ్లపూడి. ఆ పాత్ర కొంచెం వినోదాన్ని పంచుతుంది. పల్లెటూరి అందాల్ని ఒడిసిపట్టిన కెమెరా పనితనం కూడా పర్వాలేదనిపిస్తుంది. సినిమా కాంటెక్స్ట్ లో చూస్తే ఎఫెక్టివ్ గా అనిపించకపోయినా.. అక్కడక్కడా కొన్ని జోకులు పేలాయి. ఇంతకుమించి ‘కుందనపు బొమ్మ’లో చెప్పుకోదగ్గ పాజిటివ్స్ ఏమీ లేవు. ‘కుందనపు బొమ్మ’ అన్న మంచి పేరుకు పూర్తి విరుద్ధంగా అనిపిస్తుందీ సినిమా.

నటీనటులు:

కథాకథనాల్లో విషయం ఉన్నపుడే నటీనటుల ప్రతిభ కూడా బయటపడుతుంది. అసలు విషయం లేనపుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఉన్నంతలో రాజీవ్ కనకాల.. కొత్త కుర్రాడు సుధీర్ వర్మ మాత్రం పర్వాలేదనిపించారు. థియేటర్ నుంచి బయటికొచ్చాక కాస్త గుర్తుండే పాత్రలు వీళ్లిద్దరివి మాత్రమే. హీరోయిన్ చాందిని చౌదరి కొన్ని చోట్ల అందంగా కనిపించింది. నటన గురించి చెప్పుకోవడానికేమీ లేదు. సుధాకర్ కు తన టాలెంట్ చూపించుకునే అవకాశం దక్కలేదు. నాగినీడు పాత్ర ఆరంభంలో బాగానే అనిపిస్తుంది కానీ.. తర్వాత దాన్ని తేల్చేశారు. ఝాన్సీ.. షకలక శంకర్ నవ్వులు పండించడానికి విఫలయత్నం చేశారు. ఇంతకుమించి ఎవరి గురించీ చెప్పుకోవడానికేం లేదు.

సాంకేతికవర్గం:

‘కుందనపు బొమ్మ’కు రాఘవేంద్రరావు సమర్పకుడు కావడంతో ఏదో మొహమాటం కొద్దీ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్నందించినట్లున్నాడు. ఎందుకంటే సినిమాలో ఎక్కడా కూడా ఆయన ముద్ర కనిపించదు. ఈ సినిమాకు పని చేసింది కీరవాణేనా అనిపిస్తుంది. పాటలు కానీ.. నేపథ్య సంగీతం కానీ పెద్దగా ఆకట్టుకోవు. బాపు కోసం కె.వి.మహదేవన్ ఒకప్పుడు రికార్డు చేయించుకున్న ఓ పాటను రీమిక్స్ చేశారిందులో. అది కొంచెం పర్వాలేదనిపిస్తుంది. జాన్ ఛాయాగ్రహణం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా ఏమీ లేవు. తక్కువ బడ్జెట్లో.. పరిమితమైన లొకేషన్లలో సినిమాను పూర్తి చేశారు. దర్శకుడు వర ముళ్లపూడి గురించి చెప్పడానికేమీ లేదు. అన్ని విభాగాల్లోనూ కన్సిస్టెన్సీ చూపించాడు. ఎంత పేలవమైన కథను ఎంచుకున్నాడో.. అంతే పేలవంగా తెరకెక్కించాడు.

చివరగా: అమ్మో.. కుందనపు బొమ్మా

రేటింగ్: 2/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre