Begin typing your search above and press return to search.

శ్రీదేవిని వదిలి పెట్టరా?

By:  Tupaki Desk   |   2 March 2018 10:24 AM GMT
శ్రీదేవిని వదిలి పెట్టరా?
X
టెక్నాలజీ వల్ల మీడియా ఇంత అభివృద్ధి చెందకపోయి ఉంటే బాగుండు అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఒక మహానటికి నివాళి ఇవ్వాల్సిన మీడియా తన వ్యక్తిగత జీవితంలో, చివరి రోజు బస చేసిన హోటల్ రూమ్ లో బాత్ టబ్ గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారం చేయటం సామాన్యులకు సైతం ఆగ్రహం కలిగించింది. అంత్యక్రియలు ముగిసిన సాయంత్రమే కపూర్ కుటుంబం ఉమ్మడిగా ఒక విన్నపం చేసే దాకా వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. దీనికి కోలీవుడ్ మీడియా కూడా మినహాయింపుగా నిలవలేదు. గత ఐదు రోజులుగా విస్త్రుతమైన కవరేజ్ ఇచ్చిన అక్కడి ఛానళ్ళు కొన్ని అత్యుత్సాహంతో కమల్ - శ్రీదేవికి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కథలు అల్లడం లోక నాయకుడికి సైతం ఆగ్రహం కలిగించింది.

దీనికి స్పందించిన కమల్ తాను శ్రీదేవి కలిసి పెరిగామని, వాళ్ళ అమ్మ గారి చేతి వంట తినేంత చనువు నాకు వాళ్ళింట్లో దొరికేదని, ఇంకా చెప్పాలంటే తనకు నాకు తోబుట్టువు అన్న కమల్ ఈ ఒక్క మాటతో తమ మీద అల్లుతున్న పుకార్ల కథనాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు. తనతో కలిసి నటించిన సినిమాల్లో సన్నివేశాలు, పాటలు గమనిస్తే ఏనాడూ తను హద్దు మీరిపోకపోవడాన్ని గమనించవచ్చు అంటున్నాడు. తమ మధ్య సోదర భావం ఉండబట్టే బయటికి చెప్పకపోయినా పరిచయం అయిన మొదటి రోజు నుంచి కలిసి చేసిన చివరి సినిమా వరకు అదే కంటిన్యూ చేసామని చెప్పాడు.

ఇది విషయం మీద ఖుష్బూ సుందర్ కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి విషయాల్లో ఎప్పుడు మహిళలనే టార్గెట్ చేస్తారని, శ్రీదేవి వార్త తెలిసాక మీడియా ఆల్కహాల్ గురించి బాత్ టబ్ కొలతల గురించి తప్ప ఆమెకు నిజమైన నివాళి ఇవ్వాలి అనే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఆడవారు సైతం ఇలాంటి విషయాల్లో నోరు జారడం గురించి ఖుష్బూ కాస్త గట్టిగానే మండి పడ్డారు. ఏది ఏమైనా శ్రీదేవి విషయంలో మాత్రం మీడియా వ్యవహరించిన తీరు మాత్రం ముమ్మాటికి సరి కాదు .