Begin typing your search above and press return to search.

సోగ్గాడి సిత్రాలకు వేళయ్యింది

By:  Tupaki Desk   |   7 Nov 2021 2:33 PM GMT
సోగ్గాడి సిత్రాలకు వేళయ్యింది
X
వైల్డ్ డాగ్, ద ఘోస్ట్ అంటూ వరుసగా రెండు యాక్షన్ ఎంటర్‌‌టైనర్స్‌కి కమిటైన నాగార్జున.. ఆ వెంటనే పల్లెటూరి మోతుబరి పాత్రలోకి షిఫ్టయ్యారు. ఎప్పట్నుంచో లైన్‌లో ఉన్న 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్ 'బంగార్రాజు'ని పట్టాలెక్కించారు. నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అది నిజమేనని నమ్మేలా మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు నాగ్.

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న 'బంగార్రాజు' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎంత వేగంగా సాగినా సంక్రాంతికి వచ్చేంత స్పీడ్ ఉంటుందా అనుకున్నారంతా. అయితే వచ్చే ఆలోచనతోనే ఉన్నారనినిపిస్తోంది. ఎందుకంటే అప్పుడే ఈ మూవీ నుంచి ఓ పాటను రిలీజ్ చేసేయడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. 'లడ్డుందా' అంటూ సాగే ఈ పాటను నవంబర్‌‌ 9న విడుదల చేయనున్నట్లు చెబుతూ ఇవాళ టీజర్‌‌ను వదిలారు.

ఈ టీజర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. నాగ్‌ సరదాగా ఏదో పాడటం.. దానికి అర్థమేంటని ఎవరో అడగడం.. ఇంతకాలం తెలుసుకోకుండా ఏం చేస్తున్నావురా, అడగాలి కదా, అడిగితే నేర్పిత్తా కదా అంటూ అచ్చమైన పల్లెటూరి యాసలో నాగ్ చెప్పడం బాగుంది. ఈ టీజర్‌‌లో నాగ్‌ మాత్రమే కనిపించారు కానీ, సోగ్గాడు మళ్లీ వచ్చాడు అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో నాగ్‌తో పాటు ఎవరో అమ్మాయి కూడా ఉంది. బ్యాగ్రౌండ్‌లో మేఘాలు ఉండటాన్ని బట్టి ఇది స్వర్గంలో సాగే పాట అని, ఆమె అప్సరస అయి ఉండొచ్చని అర్థమవుతోంది.

ఈ చిత్రంలో ఓ ఐటమ్‌ సాంగ్‌ ఉందని, అందులో బిగ్‌బాస్ ఫేమ్ మోనాల్ కానీ పాయల్ రాజ్‌పుత్ కానీ కనిపిస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. మరి అటు తిరిగి ఉన్న ఈ సుందరాంగి ఆ ఇద్దరిలో ఎవరో తెలుసుకోవాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. నాలుగేళ్ల క్రితం 'సోగ్గాడే చిన్ని నాయనా'తో పెద్ద హిట్టే కొట్టారు నాగ్. పంచెకట్టు, మీసకట్టు, గోదావరి యాసతో పాత సినిమాల్లో ఏఎన్నార్‌‌ని తలపించి మెప్పించిన నాగ్.. ఈ సినిమాలోనూ అదే గెటప్‌లో కనిపించి మురిపించబోతున్నారు. ఆయన క్యారెక్టర్‌‌కి, సినిమా కాన్సెప్ట్‌కి సంక్రాంతి శ్లాట్‌ కంటే బెస్ట్ మరొకటి ఉండదు. కానీ ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్‌లు ఖర్చీఫ్ వేసేసిన చోట బంగార్రాజుకి చోటు దొరకుతుందా అనేదే డౌట్. క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.