Begin typing your search above and press return to search.

ప్రస్తుతానికైతే మా ఆవిడతో ఎలాంటి గొడవల్లేవ్: కార్తికేయ

By:  Tupaki Desk   |   23 Feb 2022 10:32 AM GMT
ప్రస్తుతానికైతే మా ఆవిడతో ఎలాంటి గొడవల్లేవ్: కార్తికేయ
X
కార్తికేయ తెలుగులో ఒక వైపున హీరోగా చేస్తూనే, మరో వైపున తమిళ సినిమా 'వలిమై'లో విలన్ గా చేశాడు. అజిత్ కథానాయకుడిగా వినోద్ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన వివిధ భాషల్లో విడుదల కానుంది.

తెలుగులోనూ ఈ సినిమా ఇదే టైటిల్ తో రిలీజ్ అవుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తికేయ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'ఖాకీ' సినిమా చూసినప్పుడే ఈ దర్శకుడితో యాక్ట్ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకున్నాను. అలా జరగడం నిజంగా నా అదృష్టం.

ఈ సినిమా తనకంటే నా కెరియర్ కి హెల్ప్ కావాలని కోరుకోవడం అజిత్ గారి మంచి మనసుకు నిదర్శనం. 'ఆర్ ఎక్స్ 100' నుంచి నా ప్రతి సినిమాలో బైక్ కి ఇంపార్టెన్స్ ఉంది. 'వలిమై' సినిమా కోసం బైక్ రైడింగ్ తెలిసి ఉండటం చాలా అవసరం. కానీ నిజానికి నేను అంత పెర్ఫెక్ట్ కాదు. అందుకే ఈ సినిమా షూటింగుకు ముందుగానే చెన్నై వెళ్లి 3 రోజుల పాటు బైక్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాను. అజిత్ గారు ప్రొఫెషనల్ బైక్ రేసర్ .. ఆయన ఇచ్చిన టిప్స్ కూడా నాకు బాగా హెల్ప్ అయ్యాయి. అజిత్ గారితో సాన్నిహిత్యం పెరిగేలా చేయడం ఈ సినిమా నాకు ఇచ్చిన మరో గిఫ్ట్.

ఈ సినిమా చేసిన తరువాత రేస్ బైక్ కొనుక్కోవాలనే ఒక కోరిక నాకు కలిగింది .. త్వరలోనే రేస్ బైక్ కొంటాను. ఈ సినిమా చూసిన తరువాత యూత్ లో చాలామందికి ఈ కోరిక కలుగుతుందేమో. ఇక నా మ్యారేజ్ లైఫ్ విషయానికి వస్తే, గతంలో కంటే కాస్త బాధ్యత పెరిగినట్టుగా అనిపిస్తోంది. అంతకిమించి పెద్దగా మార్పేమీ లేదు. ఎందుకంటే పెళ్లికి ముందు చాలా కాలం నుంచే మా వైఫ్ వాళ్ల ఫ్యామిలీ నాకు తెలుసు. అప్పట్లో వాళ్లంతా నన్ను ఒక చిన్నపిల్లాడిలానే చూసేవారు. ఈ మద్యనే కాస్త గౌరవంగా చూస్తున్నారు. ప్రస్తుతానికైతే మా ఆవిడతో ఎలాంటి గొడవల్లేవ్.

ఇక వెబ్ సిరీస్ ల నుంచి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే స్క్రిప్టులు నచ్చకపోవడం వలన చేయడం లేదు. నాకు శ్రీదేవిగారంటే ఎంతో అభిమానం. ఆమె ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.

'వలిమై'తో ఆ కోరిక కూడా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది. నా కెరియర్లోనే భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.