Begin typing your search above and press return to search.

'గులాల్' సినిమాలో కెసిఆర్ జీవితం

By:  Tupaki Desk   |   8 Sep 2017 9:35 AM GMT
గులాల్ సినిమాలో కెసిఆర్ జీవితం
X
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీవిత చరిత్రపై.. టాలీవుడ్ లో సినిమా రూపొందబోతోందని గతంలోనే చెప్పేసుకున్నాం. అయితే.. ఆ తర్వాత ఈ సినిమా సంగతులు అంతగా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మూవీ టైటిల్ నే కాదు.. మోషన్ పోస్టర్ కూడా వచ్చేసింది.

కేసీఆర్ బయోపిక్ కు మేకర్స్ నిర్ణయించిన టైటిల్ 'గులాల్'. లోగో లుక్ తో మోషన్ పోస్టర్ ను దర్శకుడు లక్ష్మణ్ లాంఛ్ చేశాడు. ఇతను ఎవరో కాదు.. బందూక్ అనే మూవీతో అందరినీ ఆకర్షించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి.. తెలంగాణ ఉద్యమ నేత అయిన కేసీఆర్ జీవితాన్ని సినిమాగా మార్చబోతున్నాడు. రైటర్ కం డైరెక్టర్ అయిన విజయేంద్ర ప్రసాద్.. గులాల్ మోషన్ పోస్టర్ ను లాంఛ్ చేయగా.. కేసీఆర్ చిన్నతనం నుంచి ప్రస్తుత స్థాయి వరకూ.. ఈ చిత్ర కథ ఉంటుందని దర్శకుడు లక్ష్మణ్ చెబుతున్నాడు. అయితే.. కేసీఆర్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే విషయంపై మాత్రం మేకర్స్ పెదవి విప్పలేదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీని ఈ పాత్ర కోసం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

నవాజుద్దీన్ సిద్దిఖీని ఇప్పటికే అప్రోచ్ అయ్యారని.. కథపై నెరేషన్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. కేసీఆర్ పాత్రలో కనిపించేందుకు సానుకూలత వ్యక్తం చేసినా.. ఇంకా అగ్రిమెంట్స్ పై సంతకాలు పూర్తి కాకపోవడంతోనే.. అధికారిక ప్రకటన చేయలేదట. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని తెలుస్తోంది. అయితే.. గతంలో నిర్మాత మధుర శ్రీధర్ కూడా కేసీఆర్ పై బయోపిక్ తీస్తానని ఓ ప్రకటన చేశారు. అయితే.. ఇప్పుడు లక్ష్మణ్ దర్శకత్వంలో గులాల్ ప్రకటన రావడంతో.. కేసీఆర్ బయోపిక్ ను ఎవరు తెరకెక్కించనున్నారనే అంశంపై స్పష్టత వచ్చినట్లయింది.