Begin typing your search above and press return to search.

మంచు ట్వీట్‌ కు ఊహించ‌ని పంచ్ ప‌డిందే

By:  Tupaki Desk   |   7 Oct 2017 11:52 AM GMT
మంచు ట్వీట్‌ కు ఊహించ‌ని పంచ్ ప‌డిందే
X
అంద‌రికి ఒకేలాంటి స్వేచ్ఛ దొరికితే? ఎవ‌రేం అనుకున్నా.. దాన్ని చెప్పుకునే వేదిక ల‌భిస్తే? ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర్చ జ‌ర‌గ‌ని స‌రికొత్త యాంగిల్ లో చ‌ర్చ జ‌రుగుతుంద‌ని చెప్పాలి. తాజాగా అలాంటిదే ఒక‌టి సోష‌ల్ మీడియాలో చోటు చేసుకుంది. సినీ సెల‌బ్రిటీ మంచువారి అమ్మాయి ల‌క్ష్మికి ఈ మ‌ధ్య‌న కోపం రావ‌టం తెలిసిందే. గ‌చ్ఛిబౌలి నుంచి కారులో వెళుతున్న ఆమెకు.. చుక్క‌లుచూపించేలా ట్రాఫిక్ జాం కావ‌టాన్ని భ‌రించ‌లేక‌పోయింది.

ప్రోటోకాల్స్  పెట్టుకొని రోడ్ల మీద తిరిగే వారి పుణ్య‌మా అని సామాన్యులు ఎంత ఇబ్బంది ప‌డిపోతున్నారో తెలుసా? త‌న మాదిరి రోడ్ల మీద కార్ల‌లో తిరిగితే ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుస్తాయంటూ గ‌య్ మంది. మంచు ల‌క్ష్మి లాంటి ఫైర్ బ్రాండ్ చేసిన ట్వీట్ మీడియాలో త‌ళుక్కున మెరిసింది.

మంచు ల‌క్ష్మికే ఇబ్బంది పడే ప‌రిస్థితే ఎదురైందేనన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌.. ఆమెకు కౌంట‌ర్ గా ర‌స్నా పేరుతో ఒక చిన్న‌ది రిటార్ట్ ట్వీట్ ఇచ్చింది.  ట్రాఫిక్ క‌ష్టాల మీద మంచు ల‌క్ష్మి ట్వీట్‌ కు కౌంట‌ర్ గా  ర‌స్నా బ‌దులిస్తూ.. బాగానే చెప్పారుకానీ.. మీరు తిరుమ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు మేం క్యూలో నిలుచొని ఉంటే.. మీరేమో వీఐపీ హోదాలో ద‌ర్శ‌నం చేసుకున్న‌ప్పుడు మాకూ ఇలాంటి భావ‌నే క‌లుగుతుందంటూ చుర‌కేసింది.

మంచు ల‌క్ష్మికి కౌంట‌ర్ ఇవ్వ‌ట‌మే కానీ పంచ్ లు వేయించుకోవ‌టం అల‌వాటు లేక‌పోవ‌టంతో.. ర‌స్నా ట్వీట్‌కు బ‌దులిచ్చింది. రోడ్డుకు.. తిరుమ‌ల ద‌ర్శ‌నానికి లింకేంటి? అంటూ క్వ‌శ్చ‌న్ వేసి.. నువ్వు డ‌బ్బులు క‌డితే వీఐపీ అయిపోతావ్ అంటూ ఉచిత స‌ల‌హా ఒక‌టి ఇచ్చేసింది. అంత‌టితో వ‌ద‌ల‌కుండా ఊరికే మాట అనేయ‌టం అల‌వాటైపోయిందంటూ రిటార్ట్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. ఈ ర‌స్నా పిల్ల ఎవ‌రో కానీ అంత తేలిగ్గా వ‌దిల్లేదు. ఓహ్ నేనుకూడా వీఐపీ కావొచ్చా? అంటూ క్వ‌శ్చ‌న్ వేసి.. వీఐపీలం అయిపోయి సామాన్యుల‌ను క్యూ లైన్లో అపేద్దాం అంటూ మ‌ళ్లీ రిటార్ట్ ఇచ్చింది.

ఇలా మంచులక్ష్మి.. ర‌స్నాల మ‌ధ్య జ‌రిగిన ట్విట్ట‌ర్ సంభాష‌ణ చూస్తే.. విష‌యం ఎక్క‌డ మొద‌లై.. మ‌రెక్క‌డో ముగిసిన‌ట్లుగా క‌నిపిస్తుంది. కానీ.. ర‌స్నా అన్న దాన్లో పాయింట్ లేక‌పోలేదు. ఒక గంట వ్య‌వ‌ధిలో త‌క్కువ‌లో త‌క్కువ ఆరు వేల నుంచి తొమ్మిది వేల మంది భ‌క్తులు శ్రీవారి ద‌ర్శ‌నాన్ని కానిచ్చేస్తారు.కానీ.. వంద‌ల్లో ఉండే వీవీఐ భ‌క్తుల‌కు బ్రేక్ ద‌ర్శ‌నంలో స్వామి వారిని ద‌గ్గ‌ర‌గా.. క‌నులారా చూసుకొని.. హార‌తి తీసుకోవ‌చ్చు. అంతేనా.. బ్రేక్ ద‌ర్శ‌నంతో కేవ‌లం 45 నిమిషాల్లో ద‌ర్శ‌నం పూర్తి చేసుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో అయితే 20 నిమిషాల్లో కూడా కోరిన‌ట్లుగా ద‌ర్శ‌నం పూర్తి చేసుకోవ‌చ్చు.  కాకుంటే.. వీరికి వీవీఐపీల లెట‌ర్లు కావాల్సి ఉంటాయి. ఈ వీవీఐపీ ద‌ర్శ‌నాల్లో సామాన్యుల్ని తోసేసిన‌ట్లుగా తోసేయ‌టాలు గ‌ట్రా ఏమీ ఉండ‌వు మ‌రి. ఈ ర‌స్నా ఎవ‌రో కానీ భ‌లే పాయింట్ బ‌య‌ట‌కు తీసుకొచ్చి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు పెట్టింద‌నే చెప్పాలి.