Begin typing your search above and press return to search.

హద్దులు దాటిన లక్మిస్ ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   1 April 2019 7:57 AM GMT
హద్దులు దాటిన లక్మిస్ ఎన్టీఆర్
X
ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకుండా చేయడం కొంత మేరకు ఫలితాన్ని ఇచ్చింది కానీ ఆ రాష్ట్రంలో ఉండే సినిమా ప్రియుల ఉత్సుకతను మాత్రం అడ్డుకోలేకపోయింది. దానికి తార్కాణంగా తెలంగాణ సరిహద్దులకు దగ్గరగా ఉండే ఏపీ ప్రాంతాల ప్రజలు అదే పనిగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడటం కోసమే దగ్గరున్న కేంద్రాలకు వెళ్లి మరీ సినిమా ఎంజాయ్ చేయడాన్ని చెప్పుకోవచ్చు. నిజానికి ఇది వర్మ కూడా ఊహించి ఉండడు.

ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత మూడు రోజుల నుంచి అక్కడి మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్స్ రికార్డు చేయడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాకు చుట్టుపక్కల సరిహద్దుల్లో సుమారు రెండు వందలకు పైగా గ్రామాలూ పట్టణాలు ఉన్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసేందుకే ఆ ప్రాంతాల ప్రజలు ఖమ్మం హాళ్ల వైపు వచ్చారని ట్రేడ్ రిపోర్ట్. కర్నూల్ కు అతి దగ్గరగా కేవలం 50 కిలోమీటర్ల పరిధిలో తెలంగాణా రాష్ట్రంలోని గద్వాల్-అయిజ కేంద్రాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.

నిజానికి తెలంగాణలో టిడిపి ప్రాబల్యం సున్నా. దాని తాలూకు వ్యవహారాల పట్ల జనానికి అంతగా ఆసక్తి లేదు. అయితే ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడనేది ఇందులో వివరంగా చూపించారన్న ప్రచారం జోరుగా సాగడంతో ఆ ఒక్క కారణం వాళ్ళను అంత దూరం వెళ్లేలా చేస్తోంది. కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీ నాయకులు స్పాన్సర్ చేసి మరీ జనాన్ని సినిమాలు పంపుతున్నారన్న ప్రచారం ఉంది కానీ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు.

ఖమ్మంతో పాటు మధిర సత్తుపల్లి అశ్వారావ్ పేటకు బయట నుంచి వచ్చి సినిమా చూస్తున్న వాళ్ళ తాకిడి ఎక్కువగా ఉందట. ఏదైతేనేం మొత్తానికి వర్మ అనుకున్నది సాధించాడు. ప్రెజెంటేషన్ తో సంబంధం లేకుండా కేవలం కంటెంట్ మీద ఆసక్తి రేపి లక్ష్మీస్ ఎన్టీఆర్ ని పబ్లిక్ టాక్ గా మార్చేశాడు