Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

By:  Tupaki Desk   |   29 March 2019 10:01 AM GMT
మూవీ రివ్యూ : లక్ష్మీస్ ఎన్టీఆర్
X
చిత్రం : 'లక్ష్మీస్ ఎన్టీఆర్'

నటీనటులు: విజయ్ కుమార్ - యజ్ఞ శెట్టి - శ్రీతేజ్ తదితరులు
సంగీతం: కళ్యాణి మాలిక్
ఛాయాగ్రహణం: రామీ
రచన-రామ్ గోపాల్ వర్మ - నరేంద్ర చారి
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి - దీప్తి బాలగిరి
దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ-అగస్త్య మంజు

నందమూరి తారక రామారావు జీవిత కథతో నందమూరి బాలకృష్ణ-క్రిష్ కలిసి చేసిన ‘యన్.టి.ఆర్’ సినిమా చూశాం. ఐతే ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి ఆ చిత్రంలో చూపించని ముఖ్య ఘట్టాలతో రామ్ గోపాల్ వర్మ తీసిన సిినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అత్యంత వివాదాస్పద కథతో వర్మ రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

1989 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఎన్టీఆర్ ఒక రకమైన నైరాశ్యంలో ఉంటూ, ఒంటరితనం అనుభవిస్తూ సమయంలో ఆయన జీవిత కథ రాసేందుకు లక్ష్మీపార్వతి వస్తుంది. లక్ష్మి వ్యక్తిత్వం నచ్చి తన జీవిత కథను రాసేందుకు ఆమెకు అనుమతి ఇస్తాడు ఎన్టీఆర్. ఈ పుస్తకం రాసేందుకు ప్రతి రోజూ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి వెళ్తూ ఆయనకు బాగా దగ్గరవుతుంది లక్ష్మీపార్వతి. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకుంటాడు. కానీ కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అయినా ఎన్టీఆర్ లక్ష్మిని పెళ్లాడతాడు. తర్వాత 94 ఎన్నికల్లో విజయం కూడా సాధిస్తాడు. ఈ స్థితిలో ఎన్టీఆర్‌ను గద్దె దింపడానికి నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు.. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథ.

కథనం - విశ్లేషణ:

లక్ష్మీపార్వతితో వివాహం.. చంద్రబాబు వెన్నుపోటు.. మరణం.. ఈ ఉదంతాలు లేకుండా ఎన్టీఆర్ జీవితాన్ని చూపిస్తే అది అసమగ్రమే అవుతుంది. ఐతే నందమూరి బాలకృష్ణ-క్రిష్ టీం ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకమ్మ కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేసి.. ఆమె మరణం దగ్గర కథను ఆపేయడంతో ఆ కథ ఎటూ కాకుండా పోయింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఫ్లాట్ గా చూపించడం, పైగా చంద్రబాబు పాత్రను పూర్తి పాజిటివ్ గా చూపడంతో ‘యన్.టి.ఆర్’ ప్రేక్షకులకు రుచించలేదు. ఐతే ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన.. చరిత్రలో మరుగున పడిపోయిన ఘట్టాలే ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ‘యన్.టి.ఆర్’ సినిమాకు కొనసాగింపుగా చెప్పొచ్చు. ‘యన్.టి.ఆర్’ కథ ఎక్కడైతే ఆగిందో దానికి కొంచెం ముందుకు వెళ్లి.. అక్కడి నుంచి ఎన్టీఆర్ జీవిత చరమాంకం వరకు ఇందులో చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య-క్రిష్ మధ్యలో వదిలేసిన కథను వర్మ తీసుకుని.. దానికి ఒక ముగింపు ఇచ్చాడని చెప్పొచ్చు. క్రిష్ తీసిన ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలతో పోలిస్తే వర్మ చెప్పిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లోనే ఆసక్తికర అంశాలు.. మలుపులు.. ఉత్కంఠ ఉండటంతో కథాంశం పరంగా ఇదే ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ వర్మ సైతం ఏకపక్షంగా కథను చెప్పే ప్రయత్నం చేయడం.. అతను దర్శకత్వంపై పూర్తిగా పట్టుకోల్పోవడం.. నాసిరకం నిర్మాణ విలువలు ఈ సినిమాను నీరుగార్చేశాయి.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి లక్ష్మీపార్వతిని అసలు కలవనే లేదని.. ఆమెకు ఈ సినిమాతో సంబంధమే లేదని వర్మ చెప్పాడు. ఐతే ఈ చిత్రంలో ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మాత్రమే ఉన్న సన్నివేశాలు బోలెడన్ని ఉన్నాయి. మరి వీళ్లిద్దరి మధ్య జరిగిన విషయాల్ని ఎవరు చెప్పాలి? ఎన్టీఆర్ లేడు కాబట్టి లక్ష్మీపార్వతే కదా? కాబట్టి ఆమె ఇన్ పుట్స్ కథలో కీలకమన్నది స్పష్టం. కాబట్టి ఆమె పాత్రను కూడా సినిమాలో ఉదాత్తంగా చూపించారు. ఆమెకు తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో అసలు సంబంధమే లేదన్నట్లు.. ఆమె ఆమాయకురాలు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు. దీన్ని బట్టి వర్మ అండ్ ఉద్దేశమేంటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రథమార్ధమంతా ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల పరిచయం.. వారి మధ్య అనుబంధం పెరిగి.. పెళ్లికి దారి తీసిన వైనాన్నే చూపించారు. ఒక రకంగా ప్రథమార్ధాన్ని ఒక ప్రేమకథలా.. కుటుంబ కథలా చెప్పొచ్చు. ద్వితీయార్ధమంతా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగ బాబు చేసిన కుట్ర రాజకీయాల.. ఎన్టీఆర్ మరణం నేపథ్యంలో నడుస్తుంది. పెద్దగా రాజకీయాల ప్రస్తావన లేకుండా ఇద్దరి బంధాన్నే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించడం వల్ల ప్రథమార్ధంలో కథనం నీరసం తెప్పిస్తుంది.

ఐతే ద్వితీయార్ధమంతా రాజకీయాల చుట్టూ తిరగడం.. వెన్నుపోటు ఎపిసోడ్ మీద ఫోకస్ చేయడం వల్ల కథాకథనాలు కొంచెం ఆసక్తి రేకెత్తిస్తాయి. చంద్రబాబు పాత్ర విషయంలో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సినిమా నడుస్తుంది. బాబు మద్దతుదారులు మండిపోయేలా.. వ్యతిరేకులు బాగా ఎంజాయ్ చేసేలా ఆ పాత్రను తీర్చిదిద్దాడు వర్మ. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు కూడా అలాగే ఉంది. బాబు పాత్ర వరకు మాత్రమే ఒక ఇంటెన్సిటీ చూపించగలిగాడు వర్మ. వైస్రాయ్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా సాగుతుంది. బాబు పాత్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ ను సైతం బాగా సాగదీయడంతో మళ్లీ నీరసం వచ్చేస్తుంది. ద్వితీయార్ధంలో కొంచెం పైకి లేచిన సినిమా.. చివరి అరగంటలో మళ్లీ కింద పడుతుంది. షార్ప్ గా ముగించాల్సిన కథను.. వర్మ అండ్ టీం అనవసరంగా లాగింది. నందమూరి కుటుంబ సభ్యుల్ని సినిమాలో పూర్తి నెగెటివ్ గా చూపించారు. ఐతే వారితో ముడిపడ్డ సన్నివేశాల్ని వర్మ చాలా పేలవంగా తీశాడు. అతను ఎంచుకున్న కాస్టింగ్ పూర్తిగా తేలిపోయింది. ఏదో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ సీన్స్ చూస్తే. దీనికి తోడు చాలా చోట్ల నిర్మాణ విలువల్లో కూడా ఒక స్థాయి లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయింది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కథాంశమే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథకు కీలకమైన వైస్రాయ్ ఎపిసోడ్ ను మాత్రమే వర్మ-అగస్త్య మంజు ఓ మోస్తరుగా డీల్ చేశారు. ‘యన్.టి.ఆర్’ లాగే ఇది కూడా ఒక ప్రాపగండా ఫిలిం అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. దీనికి తోడు కాస్టింగ్ విషయంలో వర్మ వేసిన తప్పటడుగులు.. పేలవమైన నిర్మాణ విలువలు.. పట్టులేని దర్శకత్వం కారణంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సగటు ప్రేక్షకుడికి అంతగా రుచించదు.

నటీనటులు:

ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజయ్ కుమార్ పర్వాలేదనిపించాడు. పోలికల విషయంలో ఎన్టీఆర్ ను అతను అంతగా మ్యాచ్ చేయలేకపోయాడు. హావభావాలు, నటన ఓకే. వాయిస్ మిమిక్రీ చేయించినట్లుగా ఉండటంతో కృత్రిమంగా అనిపిస్తుంది. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటన, హావభావాలు సినిమాలో అతి పెద్ద హైలైట్. పాత్ర తాలూకు కన్నింగ్ నెస్ చూపించడంలో శ్రీతేజ్ మెప్పించాడు. ద్వితీయార్ధంలో అతడి పాత్ర ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. లక్ష్మీపార్వతి పాత్రలో చేసిన యజ్ఞ శెట్టి మెప్పించింది. మిగతా రెండు పాత్రల విషయంలో అనుకరణ కనిపిస్తుంది కానీ.. ఈ పాత్ర విషయంలో అలా ప్రయత్నించలేదు. మోహన్ బాబుగా చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లెవ్వరూ తమదైన ముద్ర వేయలేకపోయారు.

సాంకేతికవర్గం:

కళ్యాణి మాలిక్ పాటల్లో కొన్ని బాగున్నాయి. ఎస్పీ బాలు పాడిన ‘నువ్వే నా సర్వస్వం’ ప్రత్యేకంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. చంద్రబాబు పాత్ర కనిపించినపుడు.. వెన్నుపోటు ఎపిసోడ్లో వచ్చే నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక ముద్రను చూపించాయి. రామీ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు మాత్రం పేలవం. ఒకప్పటి వర్మ సినిమాల స్థాయి క్వాలిటీ ఇందులో లేదు. కొన్ని చోట్ల బి-గ్రేడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ద్వితీయార్దంలో డైలాగులు బాగున్నాయి. దర్శక ద్వయం వర్మ-అగస్త్య మంజు ప్రత్యేకమైన ముద్ర ఏమీ వేయలేకపోయారు.వర్మ గత సినిమాలతో పోలిస్తే ఇది బెటర్ అనిపిస్తుందంతే. ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఉన్న ఈ కథను అతను బిగితో.. ఉత్కంఠతో చెప్పడంలో విఫలమయ్యాడు.

చివరగా: లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ‘పోటు’ దిగలేదు

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre