Begin typing your search above and press return to search.

'లాల్ సింగ్ చ‌ద్దా' షారూక్ చేయాల్సిన‌ది!

By:  Tupaki Desk   |   16 May 2022 8:30 AM GMT
లాల్ సింగ్ చ‌ద్దా షారూక్ చేయాల్సిన‌ది!
X
టామ్ హాంక్స్ & రాబిన్ రైట్ నటించిన 1994 హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ హిందీ రీమేక్ తో అమీర్ ఖాన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో అమీర్ తో పాటు టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య ఒక కీల‌క పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. లాల్ సింగ్ చద్దా అనే టైటిల్ తో హిందీ రీమేక్ ఆగస్ట్ 11న విడుదలవుతోంది. ఇందులో కరీనా కపూర్ ఖాన్ - మోనా సింగ్- మానవ్ విజ్ త‌దిత‌రులు న‌టించారు.

అయితే నిజానికి ఫారెస్ట్ గంప్ రీమేక్ కోసం బాలీవుడ్ ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. ఒక నివేదిక ప్రకారం.. 90వ దశకం ప్రారంభంలో, ఫిలింమేక‌ర్ కుందన్ షా అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో ఫారెస్ట్ గంప్ రీమేక్ ను ప్రకటించారు.

జానే భీ దో యారో & కభీ హాన్ కభీ నా వంటి క్లాసిక్ ల దర్శకుడు స్క్రిప్ట్ ని మళ్లీ హిందీ రీమేక్ కోసం రూపొందించారు. పాశ్చాత్య ధోర‌ణిలో ఉండే స్క్రిప్టును భారతీయ భావాలను దృష్టిలో ఉంచుకుని మార్చారు. అయితే కాల్షీట్ల‌ సమస్య కారణంగా అనిల్ కపూర్ రీమేక్ నుండి వైదొలగవలసి వచ్చింది. తర్వాత కుందన్ షా తన 'కభీ హాన్ కభీ నా' స్టార్ షారుఖ్ ఖాన్ ను హీరోగా తీసుకున్నాడు.

షేక్ చిల్లీ అనే చమత్కారమైన చిత్రం తీయాల‌నుకున్నారు. ఒక వ్యక్తి తన‌కు చెందిన దేశంతో పాటు చేసే ప్రయాణం గురించిన క‌థ ఇది. దురదృష్టవశాత్తూ ర‌క‌ర‌కాల కారణాల వల్ల అప్ప‌ట్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ప్రకటన వెలువడిన కొన్ని సంవత్సరాల తర్వాత కుందన్ షా చివరికి దానిని నిలిపివేశాడు.

రెండు దశాబ్దాల తర్వాత షారుఖ్ ఖాన్ .. కరణ్ జోహార్ 'మై నేమ్ ఈజ్ ఖాన్‌'లో నటించాడు. అది ఫారెస్ట్ గంప్ నుండి కొంత ప్రేరణ పొంది రూపొందించిన‌ది. టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో SRK న‌టిస్తే అది అసాధార‌ణ ప్రాజెక్ట్ అయ్యేది. కానీ అది జ‌ర‌గ‌లేదు.

కుందన్ షా SRK (ఎవరు)తో ఒక చిత్రాన్ని రూపొందించాలని యోచిస్తున్నారని 90ల నాటి వార్తకు సంబంధించిన‌ క్లిప్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. అనిల్ కపూర్ స్థానంలో షారూక్ న‌టిస్తార‌ని అందులో రాసి ఉంది. SRK ఈ పాత్రకు మంచి ఎంపిక అని మీరు అనుకుంటున్నారా లేదా అమీర్ సముచితమా? అంత‌కుముందే న‌టించాల‌నుకున్న అనీల్ క‌పూర్ అయితే బావుండేదా? అంటూ ఇప్పుడు అభిమానుల్లో డిబేట్ కొన‌సాగుతోంది. కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్టుల వ‌రుస ఇలా మారుతుంటుంది. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు ప్ర‌తిసారీ జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు అనేందుకు ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌.