Begin typing your search above and press return to search.

బాలీవుడ్ స్టార్ కు ధీటుగా 'కన్నడ బాహుబలి' నిలబడగలడా..?

By:  Tupaki Desk   |   23 Nov 2021 1:30 AM GMT
బాలీవుడ్ స్టార్ కు ధీటుగా కన్నడ బాహుబలి నిలబడగలడా..?
X
యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ''కేజీయఫ్: చాప్టర్ 2'' ఒకటి. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫైనల్ గా 2022 ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీని కోసం ప్రభాస్ 'సలార్' సినిమాని కూడా పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ''లాల్ సింగ్ చద్దా''. కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ముందుగా క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి వాలెంటైన్స్ వీక్ కు వాయిదా వేశారు. అయితే ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీకి షిఫ్ట్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దీంతో 'కేజీయఫ్ 2' 'లాల్ సింగ్ చద్దా' మధ్య గట్టి పోటీ ఏర్పడే పరిస్థితి వచ్చింది.

అమీర్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'బాహుబలి 2' సినిమాకు ముందు ఇండియాలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా అమీర్ దే. ఇప్పుడు 'లాల్ సింగ్' తో మరోసారి తన సత్తా ఏంటో చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈసారి సౌత్ మార్కెట్ కోసం నాగచైతన్య ను జత చేర్చుకున్నారు. అందులోనూ తన మాజీ భార్యతో కలిసి నిర్మిస్తున్న సొంత సినిమా కావడంతో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే అమీర్ ఖాన్ ను 'కేజీయఫ్ 2' తట్టుకోగలదా అనే కామెంట్స్ వస్తున్నాయి.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన 'కేజీయఫ్' సినిమా హిందీ మార్కెట్ లోనూ సత్తా చాటింది. బాలీవుడ్ సినిమాలకు ధీటుగా వసూళ్ళు రాబట్టింది. అప్పుడు దీనికి పోటీగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన 'జీరో' సినిమా రిలీజ్ అయింది. అయితే కన్నడ బాహుబలి ముందు బాద్ షా సినిమా చతికిలిపడింది. ఈసారి చాప్టర్-2 కు పోటీగా అమీర్ ఖాన్ సినిమా వస్తోంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. అందుకే ఈసారి సమ్మర్ వార్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

'లాల్ సింగ్ చద్దా' సినిమాని అన్ని భాషల్లోనూ అమీర్ ఖాన్ ఒక్కరే తన భుజస్కంధాల మీద మోసుకెళ్లగలరు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్ నుంచి నాగచైతన్య సపోర్ట్ కూడా ఉంది. 'KGF 2' కి బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ - రవీనా టండన్ వంటి స్టార్స్ మద్దతు ఉంది. వీరికి ఏదైనా బిగ్ స్టూడియో లేదా ఫిల్మ్ మేకర్ కలిస్తే ఉత్తరాది మార్కెట్ లో యష్ సినిమా గట్టిగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రమోషన్స్ తిరిగి ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏవి ప్రేక్షకాదరణ పొందుతాయో చూడాలి.