Begin typing your search above and press return to search.

లతాజీ నోట తెలుగు పాట

By:  Tupaki Desk   |   6 Feb 2022 8:30 AM GMT
లతాజీ నోట తెలుగు పాట
X
ఆమె సంగీత శిఖరం. ఆమె చూడని ఎత్తులు లేవు, చేరని శిఖరాలు లేవు. ఆమె భారత దేశం గర్వించతగిన గొప్ప సంగీత కళాకారిణి. గొప్ప విదుషీమణి. ఆమె భారత జాతి సంపద. ఆమె ఇప్పటిదాకా మనతోఉన్నారని నిబ్బరంగా ఉన్న దేశం ఈ రోజు అన్నీ కోల్పోయినట్లుగా చిన్నబోయింది. నిజమే. ఈ రోజు భారత రత్నం చేజారిన రోజు. లతా మంగేష్కర్ గొప్ప గాయని అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక అద్భుతం అని చెబితే సబబు.

ఎందుకంటే అద్భుతాలను ఎవరూ సృష్టించలేరు. అవి వాటంతటవేగా ఆవిర్భవిస్తాయి. అది అద్భుతమని మనం గుర్తించకపోయినా కూడా వాటికి ఏమీ విలువ తగ్గదు. లతాజీ ఆ కోవలోకి చెందిన వారు. ఆమె తొమ్మిది పదుల సంపూర్ణ జీవితాన్ని గడిపారు. ఆమె పదమూడవ ఏటనే తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ సుస్వరం అలా కొనసాగుతూ కోట్లాది మంది చెవులను తన సొంతం చేసుకుంది. వారి గుండెలలో తనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంది.

అలాంటి లతా మంగేష్కర్ తెలుగులో కూడా మూడు ఆణి ముత్యాల లాంటి పాటలు పాడారు. అందులో ఒకటి నిదురపోరా తమ్ముడా ఒకటి. ఈ పాట 1955లో వచ్చిన అక్కినేని హీరోగా వచ్చిన సంతానం మూవీలోనిది. ఈ రోజుకీ ఆ పాట వింటూంటే ఒక కమ్మని గీతం చెవులకు సోకి హాయిగా వేరే లోకానికి తీసుకెళ్తుంది. మత్తుగా గమ్మత్తుగా సాగిపోతుంది ఆ పాట. నిద్రలోకి అమ్మ పాటగా కమ్మనైన పాటలా తీసుకుపోతుంది.

ఆ తరువాత మరో పాట 1965లో వచ్చిన దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశా అంటూ లతాజీ భక్తిపారవశ్యంతో పాడిన పాట ఈ రోజుకీ శ్రోతలను అలా వెంటాడుతూనే ఉంటుంది. ఇక చివరిగా ఆమె పాడిన మూడవ పాట అందరికీ బాగా గుర్తుండిపోవడమే కాదు, పెదవుల మీద ఈ రోజుకీ కదిలే పాట. అదే తెల్ల చీరకు తకధిమి తపనలు రేగె అన్నది.

ఈ పాటను బాలూతో కలసి లతాజీ ఆలపించారు. ఇక బాలూతో ఆమె హిందీలో కూడా అనేక పాటలు పాడారు. ఏది ఎలా ఉన్నా ఆమె పాడిన మూడు తెలుగు పాటలు చాలు, వేయేళ్ల సంపదగా తెలుగులో నిలిచాయి. ఆమె పాడిన తెలుగు పాటల‌లో ఆమె ఉచ్చారణ కూడా గమనించతగినది. తెలుగు వారు కూడా అంత స్వచ్చంగా పాడగలరా అన్నట్లుగా లతా మంగేష్కర్ ఆలపించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నిజంగా లెజండరీ సింగర్. అంతే కాదు, ఆమె భారత దేశానికి దొరికిన ఆణిముత్యం. ఇది సత్యం.