Begin typing your search above and press return to search.

సంక్రాంతికి 'ఆర్ ఆర్ ఆర్' రానేరాదంటున్నారే!

By:  Tupaki Desk   |   8 Oct 2021 5:30 AM GMT
సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ రానేరాదంటున్నారే!
X
జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' వస్తోంది అనగానే .. పక్కకి పక్కకి జరగండి అనేసి, ఆ చుట్టుపక్కల ఉన్న సినిమాలన్నీ సర్దుకుని తప్పుకుంటాయని చాలామంది అనుకున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు .. జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకని అలా అంటే .. 'ఆర్ ఆర్ ఆర్' సంక్రాంతికి వచ్చే ఛాన్స్ లేదు గనుక అనేసి తాపీగా సమాధానం చెబుతున్నారు. పక్కానా? అంటే .. 'లాక్ చేసుకో' అంటున్నారు. అంత పెద్ద సినిమా వస్తుంటే వీళ్లకి కనీసం కందిరీగ కొట్టినట్టుగా కూడా లేదే అనిపించడం సహజం. కానీ ఈ సినిమా రాదనడానికి కొంతమంది కొన్ని లెక్కలు చెబుతున్నారు.

సంక్రాంతి బరిలో ఆ మూడు రోజులను నమ్ముకుని మూడు సినిమాలు బరిలోకి దిగాయి. జనవరి 12వ తేదీన 'భీమ్లా నాయక్' సినిమాను విడుదల చేయనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, పవన్ - రానా ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నెలాఖరుతో షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఆ తరువాత మిగతా పనులను కంప్లీట్ చేయడానికి వాళ్లకి కావలసినంత సమయం ఉంది గనుక, 'భీమ్లా నాయక్' రావడంలో ఎలాంటి డౌట్ ఎవరిలో కనిపించడంలేదు.

ఆ మరుసటి రోజైన జనవరి 13వ తేదీన 'సర్కారువారి పాట' రానుంది. మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా, ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది. కానీ సెట్స్ పైకి వెళ్లిన తరువాత ఆలస్యం చేయలేదు. అందువలన రెండు పాటల మినహా మిగతా షూటింగును ఈ నెలలో పూర్తిచేయనుంది. వచ్చేనెలలో ఆ రెండు పాటలను పూర్తిచేసి, జనవరిలో రిలీజ్ కి రెడీ అవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక జనవరి 14వ తేదీన రానున్న 'రాధే శ్యామ్' కూడా ముందుగా చెప్పిన తేదీ పైనే ధైర్యంగా నిలబడ్డాడు.

'ఆర్ ఆర్ ఆర్' జనవరి 7వ తేదీన వస్తుందనే అధికారిక పోస్టర్ రాగానే, ఈ సినిమాలన్నీ కూడా తమ విడుదల తేదీలు మార్చుకుంటాయనీ .. వేసవి సెలవుల దిశగా పరిగెడతాయని అనుకున్నారు. కానీ కొంచెం కూడా కదలకుండా కాలుమీద కాలేసుకుని అలాగే కూర్చున్నాయి. అందుకు కారణం 'ఆర్ ఆర్ ఆర్' రాదనే నమ్మకమేనని అక్కడున్నవాళ్లు అంటు న్నారు. 'ఆర్ ఆర్ ఆర్'కి సంబంధించి కొన్ని వందల సీజీ షాట్లను రాజమౌళి ఓకే చేయవలసి ఉందట. రాజమౌళి ఓకే చెప్పిన తరువాతనే ఆ సంస్థలు తమ వర్క్ ను పూర్తి చేయవలసి ఉంటుంది.

అయితే ఇది అంత తేలికగా అయ్యే పనేం కాదు .. ఇందుకు చాలా సమయమే పండుతుందని అంటున్నారు. ఆ తరువాత ఒకదానికి తరువాత ఒకటిగా ప్రాసెస్ పూర్తిచేసుకుని ఫస్టు కాపీ రావడం సంక్రాంతి నాటికి జరగదని అంటున్నారు. మార్చి లో మాత్రమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటు చూస్తేనేమో సవరణలు .. అటు చూస్తేనేమో వివరణలు .. విశ్లేషణలు .. ఏది నమ్మలబ్బా?! అంటూ సినిమా ప్రేమికులు చిటపటలాడుతున్నారు. సినిమా అంటే వేలకోట్ల వ్యాపారం .. వీలు .. వాలు చూసుకునే వస్తుంది మరి!