Begin typing your search above and press return to search.

ప్రభాస్ కు జగన్ మద్దతు లభిస్తుందా..?

By:  Tupaki Desk   |   6 March 2022 5:30 AM GMT
ప్రభాస్ కు జగన్ మద్దతు లభిస్తుందా..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపు మరియు ఐదో షో అనుమతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయినప్పుడు టాలీవుడ్ పెద్దలకు ఈ మేరకు హామీ ఇచ్చారు.

రెమ్యునరేషన్‌లు మినహా 100 కోట్ల బడ్జెట్ పై బడిన భారీ సినిమాలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తామని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు అడుగులు ముందుకు వేసినా.. ఇంతవరకు టికెట్ రేట్ల సవరణ జీవో జారీ కాలేదు. దీంతో వచ్చే వారం 'రాధేశ్యామ్' విడుదలయ్యే లోపు ప్రభుత్వ జీవో వస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారతీయ భాషలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పలు విదేశీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జెట్ స్పీడ్ తో ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు.

పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన 'రాధేశ్యామ్' చిత్రానికి దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేశారు. సినిమాపై ఉన్న బజ్ చూస్తే భారీ ఓపెనింగ్స్ గ్యారంటీ అని అర్థం అవుతుంది. కాకపోతే మిగతా ఏరియాల సంగతి పక్కన పెడితే ఆంధ్రాలో మాత్రం ప్రస్తుతమున్న రేట్లతో కాస్త ఇబ్బందే అని చెప్పాలి.

ఏపీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాలంటే ప్రభాస్ కు జగన్ సర్కార్ సపోర్ట్ కూడా అవసరం ఉంది. మార్చి 11వ తేదీ లోపు టికెట్ ధరల సవరణ జీవో జారీ చేస్తే మాత్రం ప్రభాస్ సినిమా కలెక్షన్స్ కు బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ వారాంతంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తే బాగుంటుందని అందరూ ఆలోచిస్తున్నారు.

నిజానికి ఫిబ్రవరి నెలాఖరుకు ఏపీ ప్రభుత్వం నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన సరికొత్త జీవో వస్తుందని సినీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. దీంతో ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రానికి ఏపీలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదనే టాక్ ఉంది.

బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఏపీలో టిక్కెట్ ధరల కారణంగా చాలా తక్కువ గణాంకాలను నమోదు చేసిందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'రాధేశ్యామ్‌' సినిమాకు ప్రభుత్వ మద్దతు లభిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖుల బృందంలో ప్రభాస్ కూడా ఉన్నారు. ఇప్పుడు డార్లింగ్ నటించిన సినిమానే థియేటర్లలోకి రాబోతోంది. పారితోషికాలు పక్కనపెట్టి వంద కోట్లకు పైగానే ఖర్చు చేసిన ప్రత్యేకమైన సినిమా ఇది. మరి ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి.