Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా పేరు వచ్చిందిగానీ, పెళ్లి సంబంధాలు రాలేదు!

By:  Tupaki Desk   |   21 Feb 2022 4:55 AM GMT
హీరోయిన్ గా పేరు వచ్చిందిగానీ, పెళ్లి సంబంధాలు రాలేదు!
X
1980లలో తెలుగు తెరకి పరిచయమైన కథానాయికలలో పూర్ణిమ ఒకరు. పద్ధతికి పట్టుచీర కట్టినట్టుగా కనిపిస్తూ, ప్రేక్షకుల మనసులను దోచుకున్న అతికొద్ది మంది కథానాయికలలో ఆమె ఒకరు.

తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా వాటిలో ఎప్పటి మరిచిపోలేని సినిమాలు ఉన్నాయి. ఇప్పటికీ పాడుకునే పాటలు ఉన్నాయి. ఆ జాబితాలో 'ముద్దమందారం' .. 'నాలుగు స్తంభాలాట' .. 'శ్రీవారికి ప్రేమలేఖ' .. 'మా పల్లెలో గోపాలుడు' వంటి సినిమాలు కనిపిస్తాయి.పూర్ణిమ కథానాయికగా నిలదొక్కుకోవడానికి కారకులు జంధ్యాల గారు. ఆమె కెరియర్లో చెప్పుకోదగిన హిట్లు ఆయన ఇచ్చినవే.

'తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు' .. 'చినుకులా రాలి' పాటలు వినగానే ఆ పాటల్లోని పూర్ణిమ రూపమే ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. తెలుగుదనం ఉట్టిపడే పక్కింటమ్మాయి పాత్రల్లో ఆమె అందరి మనసులను దోచుకున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లోను చేసిన పూర్ణిమ, వివాహమైన తరువాత సినిమాలకి దూరమయ్యారు.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమమ్స్లో ఆమె పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. తన కెరియర్ కి సంబంధించిన అనేక అనుభవాలు .. అంశాలను ఆమె ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నట్టుగా తెలుస్తోంది.

అలీ అడిగిన ప్రశ్నలకి ఆమె స్పందిస్తూ .. " సినిమాల్లోకి నటిగా రావడానికి ముందు నేను సింగర్ ను కావాలనుకున్నాను. నటిగా ముందుగా నాకు 'సప్తపది'లో అవకాశం వచ్చింది. ఆ పాత్రకి డాన్స్ తెలిసి ఉండాలి .. నాకేమో డాన్స్ రాదు. అందువలన ఆ సినిమా చేజారిపోయింది. అప్పుడు జంధ్యాలగారు నాకు 'ముద్దమందారం' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

నా కెరియర్ లో బెస్ట్ మూవీ 'శ్రీవారికి ప్రేమలేఖ' అని చెబుతాను. 'మా పల్లెలో గోపాలుడు' సినిమా అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో 'రాణి రాణెమ్మ' అనే పాటను ఒక రాత్రంతా చిత్రీకరించారు. హీరోయిన్ గ చేస్తూనే కృష్ణగారి సినిమాలో ఆయనకి చెల్లెలిగా చేశాను. ఇక ఏఎన్నార్ గారు మాత్రం నాతో హీరోగా చేయాలనుందని సరదాగా అంటుండేవారు. నేను సినిమాల్లో చేస్తుండటంతో పెళ్లి సంబంధాలు రాలేదు. ఇక నాకు పెళ్లి కాదనే అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.