Begin typing your search above and press return to search.

ఏపీలో 'భీమ్లా' థియేటర్ క్లోజ్..!

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:16 AM GMT
ఏపీలో భీమ్లా థియేటర్ క్లోజ్..!
X
పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ సినిమా కోసం అత్యధిక స్క్రీన్స్ కేటాయించారు. అయితే తెలంగాణాలో ఐదు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం ఇవ్వడంతో.. అన్ని ప్రాంతాల్లో పొద్దుపొద్దున్నే స్పెషల్ షోలు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది.

ఏపీలో బెనిఫిట్ షోలకు పర్మిషన్ లేదని థియేటర్ యాజమాన్యాలను రెవెన్యూ అధికారులు ముందుగానే ఆదేశాలు జారీ చేసారు. జీవో నెం. 35 ప్రకారమే సినిమా టికెట్ ధరలను వర్తింప చేయాలని నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి టిక్కెట్ రేట్లు పెంచి విక్రయించినా అదనపు షోలు ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో థియేటర్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించారని తెలుస్తోంది.

ఇకపోతే కృష్ణా జిల్లా మైలవరంలో 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శించే ఓ థియేటర్‌ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు గేటు బయట నోటీసు అతికించడంతో సినిమా చూడటానికి వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ ధరలతో సినిమా ప్రదర్శనను నిలిపివేసి థియేటర్ క్లోజ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అలానే ప్రకాశం జిల్లా ఇంకొల్లులోనూ 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శన నిలిపివేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విజయనగరం - గుంటూరు - విజయవాడ సహా పలు ప్రాంతాల్లో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ లో బెనిఫిట్‌ షోలకు అవకాశం లేకపోవడంతో తమ అభిమాన హీరో సినిమాని ముందే చూడాలన్న ఆతృతతో ఉన్న పవన్ ఫ్యాన్స్.. సమీప ప్రాంతాలకు తరలివెళ్లి సినిమా చూశారని తెలుస్తోంది.

ఆంధ్రా సరిహద్దు ప్రాంతవాసులు అందరూ తెలంగాణకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా చూసారు. అలానే పుదుచ్ఛేరిలో యానాంలో ప్రత్యేక షోలకు అధికారులు అనుమతి ఇవ్వడంతో.. గోదావరి జిల్లాలలోని పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ యెద్ద ఎత్తున యానాంకు తరలి వెళ్లడం గమనార్హం.