Begin typing your search above and press return to search.

'బాలరాజు కథ' నన్ను నటనవైపుకు నడిపించింది: చిరంజీవి

By:  Tupaki Desk   |   31 March 2022 4:30 AM GMT
బాలరాజు కథ నన్ను నటనవైపుకు నడిపించింది: చిరంజీవి
X
తెలుగులో చిన్న పిల్లలు ప్రధాన పాత్రలుగా ఈ మధ్య కాలంలో ఏ సినిమాలు రాలేదనే చెప్పాలి. చాలా కాలం తరువాత అలాంటి ఒక సినిమా వస్తోంది .. ఆ సినిమా పేరే 'మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ కీలకమైన పాత్రను పోషించగా, రోషన్ .. హర్ష .. భాను ప్రధానమైన పాత్రలలో కనిపించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా చిరంజీవి మాట్లాడుతూ .. "కొన్ని ఫంక్షన్స్ కి ఆబ్లిగేషన్స్ పై వెళతాం .. కొన్ని ఈవెంట్స్ కి ప్రేమతో వస్తాం. అలా ప్రేమతో నేను వచ్చిన ఈవెంట్ ఇది.

ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డిని చూస్తే నాకు చాలా ఆత్మీయుడిలా అనిపిస్తారు. ఒక వైపున 'ఆచార్య' చేస్తూనే మరో వైపున ఆయన ఈ సినిమాను నిర్మించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని రోజుల క్రితం వచ్చి ఇలా ఒక సినిమా తీశాము అని చెప్పినప్పుడు, ఈ కాంబినేషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇలాంటి ఒక సినిమాకి భుజం కాయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. హిందీకి వెళ్లిన తరువాత తాప్సీ తనని తాను ఎంతలా మార్చుకుందనేది నేను గమనించాను.

'ఝుమ్మంది నాదం' ఫంక్షన్లో నేను చూసినప్పుడు తాప్సీ ఒక డెలికేట్ డాల్ మాదిరిగా అనిపించింది. అలాంటి తాప్సీ ఎంతో పవర్ఫుల్ పాత్రలు పోషిస్తూ వెళుతూ అక్కడ తనకంటూ ఒక మార్క్ వేసుకోవడం చూసి షాక్ అయ్యాను. అలాంటి తాప్సీ ఈ సినిమాలో ఏం చేసిందా అనే చూశాను .. చాలా గొప్పగా అనిపించింది. ఈ ముగ్గురు కుర్రాళ్లు కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. 'బాలరాజు కథ' సినిమాలో మాస్టర్ ప్రభాకర్ ను చూసినప్పుడు, సినిమాల్లో చేయాలని అనిపించింది. ఆ సినిమాతో పడిన బీజం .. నటన పట్ల నాకు ఆసక్తి పెరగడానికి కారణమైంది.

అందువల్లనే చిన్న పిల్లల సినిమాలను మరింత ఫోకస్ చేస్తూ చూస్తుంటాను. ఈ కుర్రాళ్లంతా ప్రతి సీన్లోను చాలా చక్కగా చేశారు. ఇందాక స్టేజ్ పై కూడా నా డాన్సులను ఇరగదీశారు. ఈ సినిమాను స్వరూప్ చాలా బాగా తీశాడు. తను మేటర్ .. మెటీరియల్ ఉన్న దర్శకుడు. ఇది చిన్న సినిమా కాదు .. అందరినీ ఆకట్టుకునే పెద్ద సినిమా. నిరంజన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే ఆ సినిమాలో ఏదో మేటర్ ఉందనే అర్థం. నిర్మాతలు ప్రతి అంశంలో ఇన్వాల్ కావాలనే నేను కోరుకుంటాను. అప్పుడే ఆ ప్రాజెక్టు పట్ల ఒక భరోసా ఏర్పడుతుంది. అలాంటి భరోసాను కలిగించే నిర్మాతగా నిరంజన్ రెడ్డిని చూస్తున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.