Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత మాటలతో ఆరు నెలలు అద్దం లో చూసుకోలేదు

By:  Tupaki Desk   |   18 March 2022 8:32 AM GMT
ఆ నిర్మాత మాటలతో ఆరు నెలలు అద్దం లో చూసుకోలేదు
X
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు సుపరిచితురాలు విద్యాబాలన్. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ లలో మొదటి వరుసలో ఈమె ఉంటారు అనడం లో సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న విద్యా బాలన్ ఇప్పటికి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా లతో దూసుకు వెళుతోంది. ఒకానొక సమయంలో ఈమె చాలా లావు అయినప్పటికి ఏమాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సినిమాల్లో చేస్తూనే వచ్చింది.

అనారోగ్య కారణాల వల్ల ఆమె బరువు పెరగడం పెరిగినా కూడా ఆ ఇబ్బందిని ఎప్పుడూ కూడా లోపంగా చూడలేదు. తన ఫిజిక్ కి తగ్గ పాత్రలను చేస్తూ ఎప్పటికప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. తాజాగా నటించిన సినిమా జల్సా సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.

చాలా మంది నిర్మాతలు సినిమా ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత నోటీసు కూడా ఇవ్వకుండానే తప్పించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నం చేస్తున్న సమయం లో ఒక నిర్మాత తనను అత్యంత దారుణంగా అవమానించాడు. ఆయన మాటలు విన్న తర్వాత నేను ఆరు నెలల పాటు కనీసం అద్దం లో నన్ను నేను చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడేదాన్ని. ఆయన మాటలు అంతగా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీశాయి.

ఇంకా పలువురు నిర్మాతలు కూడా తనను తీవ్రంగా అవమానించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు నాతో సినిమాలు చేస్తానని ఆ తర్వాత వద్దన్న నిర్మాతలు ఇప్పుడు సినిమాలు చేసేందుకు డేట్లు కావాలని ఫోన్లు చేస్తూ ఉంటారు. వారందరిని కూడా నేను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గా బాలచందర్ దర్శకత్వం లో రెండు సినిమాలు చేసేందుకు అవకాశం వచ్చింది.

ఆ ఆనందంలో ఉన్న సమయంలో కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తప్పించినట్లు ఆమె చెప్పింది. సినిమా ఆఫర్లు చేజారిన సమయం లో గంటల తరబడి రోడ్డు మీద నడుస్తూ ఏడుస్తూ ఉండేదాన్ని. ఒకానొక సమయంలో మెరైన్ డ్రైవ్ నుంచి బాంద్రా వరకు నడిచాను అంటూ చెప్పుకొచ్చింది.

మూడు సంవత్సరాల పాటు తాను ఏం చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని.. దాంతో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది. కానీ పట్టుదలతో సినిమాల్లో ప్రయత్నించిన విద్యా బాలన్ ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. ఆమె నటించిన జల్సా సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలుకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి. .