Begin typing your search above and press return to search.

ఇప్పటికి రూ.60 కోట్లు.. త్వరలోనే రూ.100 కోట్లు ఖాయమట

By:  Tupaki Desk   |   17 March 2022 5:30 AM GMT
ఇప్పటికి రూ.60 కోట్లు.. త్వరలోనే రూ.100 కోట్లు ఖాయమట
X
ఒక తక్కువ బడ్జెట్ సినిమా.. విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించిన మూవీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. విడుదల వేళలో ఉన్న స్క్రీన్లకు.. వారాంతం తర్వాత స్క్రీన్ల సంఖ్యను పెంచే పరిస్థితి చాలా చాలా అరుదుగా ఉంటుంది. సంచలన విజయాన్ని సొంతం చేసుకొని అటు సినిమా రంగంలోనే కాదు.. దేశ రాజకీయ రంగంలోనూ.. సామాజికంగాను పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది తాజా బాలీవుడ్ మూవీ ది కశ్మీర్ ఫైల్స్. ఒక విధంగా చెప్పాలంటే.. కరోనా దెబ్బకు కకావికలమైన బాలీవుడ్ ఉనికిని చాటిన సినిమాగా దీన్ని కొందరు అభివర్ణిస్తున్నారు.

నిజమే.. ఆ వాదనలో నిజం ఉందని చెప్పాలి. భాష రాకున్నా.. భావాన్ని చూసేందుకు సినిమా థియేటర్లకు వెళ్లే వారు ఈ రోజుల్లో చాలా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే సినిమా విడుదలైన నెల.. రెండు నెలలకే ఓటీటీలో సినిమాలు వచ్చేస్తున్న వేళ.. పని కట్టుకొని సినిమా థియేటర్ కు వెళ్లటం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త కష్టమే. అందునా.. స్టార్ కాస్ట్ పెద్దగా లేని సినిమా విషయంలో.. ససేమిరా అనే పరిస్థితి.

అందుకు భిన్నంగా కశ్మీర్ ఫైల్స్ మూవీలో మేజిక్ చోటు చేసుకుంది. థియేటర్ లో సినిమాను చూసినోళ్లు.. బయటకు వచ్చిన తర్వాత కనీసం నలుగురైదుగురికి చెప్పి మరీ సినిమాకు వెళ్లేలా చేయటం ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది. ముప్ఫై ఏళ్ల క్రితం దేశంలోని ఒక ప్రాంతంలో దారుణ నరమేధం జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతున్న వేళ.. ఇంతకాలం దీని గురించి మాట్లాడే కొద్దిమంది ఇప్పుడు బరస్ట్ అవుతున్నారు. సినిమాలో చూపించింది కొంచెమేనని.. ఇంకా చూపించాల్సింది చాలానే ఉందన్న ఆక్రోశం వ్యక్తమవుతోంది.

1990 జనవరిలో కశ్మీర్ వ్యాలీలో కశ్మీరీ పండిట్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించటమే కాదు.. వారిని పెద్ద ఎత్తున హతమార్చటం.. మహిళల్ని అత్యాచారం చేయటం.. మతం మారాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడికి తీసుకురావటం లాంటి ఎన్నో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఈ ఘోరాలపై మీడియాతో పాటు రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటంతో.. ఈ కఠిన వాస్తవాలు బయటకు రాలేదు. ఆ తర్వాత సైతం నోరు విప్పకుండా చేశారు. తాజాగా విడుదలైన కశ్మీర్ ఫైల్స్ పుణ్యమా అని.. అప్పటి దురాగతాల గురించి అందరూ చర్చించే అవకాశం లభించింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా గడిచిన ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా రూ.60 కోట్ల వసూళ్లను సాధించింది. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు తక్కువ స్క్రీన్లలో ప్రదర్శించటం.. సోమవారం నుంచి స్క్రీన్ల సంఖ్య పెరగ్గా.. అది రోజురోజుకు పెరుగుతున్న వైనం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక వసూళ్ల విషయానికి వస్తే.. రిలీజ్ అయిన మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కేవలం రూ3.5 కోట్లు మాత్రమే. రెండో రోజుకు రూ.8.5 కోట్లకు చేరగా.. మూడో రోజు రూ.15.10 కోట్లకు చేరింది.

నాలుగో రోజున రూ.15.05 కోట్లు.. ఐదో రోజున అంటే మంగళవారం ఈ మూవీ రూ.18 కోట్లు రాబట్టింది. బుధవారం ఈ మొత్తాన్ని క్రాస్ చేసి ఉంటుందని చెబుతున్నారు. దీనికి కారణం.. స్క్రీన్లు సంఖ్య పెరగటం.. థియేటర్లు హౌస్ ఫుల్ కావటం.. పలువురు సినిమా టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగడం కనిపిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో చాలా మల్టీఫ్లెక్సులు.. ఈ సినిమా షోలను.. స్క్రీన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ మూవీ రూ.100 కోట్ల వసూళ్లను దాటేస్తుందంటున్నారు. చాలా రోజుల తర్వాత సంచలన విజయమే కాదు.. అంతకు మించిన వసూళ్లను సైతం ఈ సినిమా చేయటం గమనార్హం.