Begin typing your search above and press return to search.

'ప్రభాస్ - మారుతి' ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..?

By:  Tupaki Desk   |   17 March 2022 4:30 AM GMT
ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల 'రాధేశ్యామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ ప్రేమకథా చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీంతో డార్లింగ్ నుంచి రాబోయే తదుపరి సినిమాలపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లో ప్రభాస్ భాగం కావడం లేదని గత మూడు రోజులుగా సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. అయితే ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, మారుతి సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ ప్రిపరేషన్ ప్రారంభించాడని తెలుస్తోంది.

ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని.. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ తో రావాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కమర్షియల్ కామెడీ చిత్రాలకు పేరుగాంచిన మారుతి.. రెబల్ స్టార్ తో ఓ హారర్ కామెడీ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాని బ్యాంక్ రోల్ చేస్తున్నారని సమాచారం.

ప్రభాస్ - మారుతి ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ఇదొక హాలీవుడ్ చిత్రానికి ఫ్రీమేక్ అనే టాక్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ హాలీవుడ్ సినిమా గురించి ఎలాంటి వివరాలు లేవు.

పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ గా నివేదించబడిన ఈ చిత్రంలో ముగ్గురు మహిళా ప్రధాన పాత్రలు కనిపించనున్నాయని వినికిడి. రామానాయుడు స్టూడియోస్‌ లో ఇప్పటికే సెట్ల నిర్మాణం జరుగుతోందని.. ఏప్రిల్ 10న ఈ ప్రాజెక్ట్‌ ను అధికారికంగా ప్రారంభించనున్నారని టాక్ నడుస్తోంది.

మరోవైపు 'రాధేశ్యామ్' రిజల్ట్ చూసిన తర్వాత తమ అభిమాన హీరో మరింత బలంగా తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలానే ప్రభాస్ కామెడీ చిత్రాల్లో నటించి చాలా రోజులైంది. మరి మారుతీ అగ్ర హీరోకి అవసరమైన విజయాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే మైథిలాజీ మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో 'సలార్' అనే యాక్షన్ థ్రిల్లర్.. నాగ్ అశ్విన్ తో 'ప్రాజెక్ట్ K' అనే సైన్స్ ఫిక్షన్ మూవీని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ నటించనున్నారు.