Begin typing your search above and press return to search.

అప్పుడే రష్మిక అంత సంపాదించేసిందా?

By:  Tupaki Desk   |   21 Feb 2022 4:30 PM GMT
అప్పుడే రష్మిక అంత సంపాదించేసిందా?
X
టాలీవుడ్ కి పరిచయమై కుర్రాళ్ల మనసులను పొలోమంటూ కొల్లగొట్టేస్తున్న కథానాయికల జాబితాలో రష్మిక ముందు వరుసలో కనిపిస్తుంది. తెరపై పాలపుంతలా మెరుస్తూ .. తేనె ముంతలా ఊరించే ఈ సొగసరి కొల్లగొట్టని మనసులేదంటే అతిశయోక్తి కాదు.

ఎప్పుడు చూసినా యాక్టివ్ గా కనిపిస్తూ .. చూపులన్నీ తనవైపు తిప్పుకోవడం ఈ సుందరి ప్రత్యేకత. కన్నడ సినిమాలతో తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ సుందరి, 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అమ్మాయి, 'గీత గోవిందం' సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది.

మధ్యలో ఓ రెండు సినిమాలు కాస్త తేడా కొట్టినా, ఆ వెంటనే 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' సినిమాలతో తిప్పుకుంది. ఈ రెండు సినిమాలు కూడా ఆమె స్థాయిని మరింత పెంచాయి.

ఇక ఇటీవల వచ్చిన 'పుష్ప' ఆమె ఖాతాలో పాన్ ఇండియా హిట్ ను జమ చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండటం ఆమె చేసుకున్న మరో అదృష్టం. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సిద్ధమవుతోంది. శర్వానంద్ సరసన నాయికగా ఆమె చేసిన ఈ సినిమా, మార్చి 4వ తేదీన విడుదలవుతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక బాలీవుడ్ లో కూడా ఆమె చేసిన రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలతో అక్కడ ఆమె మరింత బిజీ కావడం ఖాయమని అంటున్నారు. కథానాయికగా కాలు పెట్టిన దగ్గర నుంచి అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో పారితోషికం కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. ఒక్కో సినిమాకి ఆమె 3 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటోందట. ఇక యాడ్స్ చేయడంలోను మిగతా హీరోయిన్స్ కంటే మూడడుగులు ముందే ఉంది. తన కెరియర్ ను మొదలుపెట్టిన ఈ నాలుగేళ్లలో ఆమె 37 కోట్లను సంపాదించిందని అంటున్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుపోమంటే, అగ్గిపుల్ల గీస్తూనే రష్మిక ఆ పని చేసేసింది. ఇక దీపం వెలిగించిన తరువాత ఏకంగా ప్యాలెస్ ను చక్కబెట్టే స్థాయిలో అమ్మడి రాబడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. నాలుగు రాళ్లను వెనకేసుకోమంటే దాదాపు 40 కోట్లనే వెనకేసిందంటే ఈ బ్యూటీ స్పీడ్ మామూలుగా లేదనే చెప్పాలి. కన్నడ .. తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తున్న ఈ సుందరి, తమిళ .. హిందీ భాషల్లోను ఆ స్థాయిని అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దశ దశదిశలా తిరిగిపోవడమంటే ఇదేనేమో!