Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ భీభ‌త్స‌మేనంట‌గా

By:  Tupaki Desk   |   23 March 2022 7:45 AM GMT
ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ భీభ‌త్స‌మేనంట‌గా
X
యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ మ‌ల్టీస్టారర్ రిలీజ్ కి కౌంట్ డౌన్ మొద‌లైంది. మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లో ఇద్ద‌రు స్టార్ హీరోల సింహ గ‌ర్జ‌న ప్రారంభం కాబోతోంది. మూడున్న‌రేళ్ల క‌ష్టం ఈ శుక్ర‌వారం ఫ‌లించ‌బోతోంది. ఎన్నో రాత్రులు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల క‌ల నెర‌వేర‌బోతోంది. ఇలా ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ ఎట్ట‌కేల‌కు మార్చి 25న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో హీరోలు రామ్ చ‌ర‌ణ్ ,ఎన్టీఆర్‌, రాజ‌మౌళి ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ల‌లో పాల్గొంటూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డిస్తున్నారు.

ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలో ఏదో ఒక కొత్త విష‌యం చెబుతున్నా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ మిగిలే వుంటోంది. ఇటీవ‌ల కీర‌వాణి టీమ్ ని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. ఆ త‌రువాత యాంక‌ర్ సుమ ఏకంగా మీమ్స్ తో రాజ‌మౌళిని ఓ ఆట ఆడేసుకుంది. ఈ సంద‌ర్భంగా కూడా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. తాజాగా దర్శ‌కుడు `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి ద‌ర్శ‌కధీరుడు జ‌క్క‌న్న‌ని ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేశారు.

తాజాగా విడుద‌ల చేసిన ఈ ఇంట‌ర్వ్యూ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఇంట‌ర్వ్యూ ట్రిపుల్ ఆర్ కి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని ద‌ర్శ‌కుడు డీటైలింగ్ గా వెల్ల‌డించ‌డం విశేషం. ఈ ఇంట‌ర్వ్యూ లో ప్ర‌ధానంగా ఎన్టీఆర్ ని బ్రిటీష్ పోలీస్ అధికారిక‌గా రామ్ చ‌ర‌ణ్ అరెస్ట్ చేసే సీన్ వుంది. దీని వెన‌కాల వున్న ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీని తాజాగా బ‌య‌ట‌పెట్టారు రాజ‌మౌళి. ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమాలో ఎన్టీఆర్ అరెస్ట్ సీన్ భీభ‌త్స‌మేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఎన్టీఆర్ పులి ఫైట్ గురించి ఆస‌క్తిర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించిన రాజ‌మౌళి.. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ అరెస్ట్ ఫైట్ వెన‌క జ‌రిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి ద‌ర్శ‌కుడు సందీప్ వంగ అడ‌గ‌డంతో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టారు రాజ‌మౌళి. ఎన్టీఆర్ ని బ్రిటీష్ అధికారిక‌గా వున్న రామ్ చ‌ర‌ణ్ అరెస్ట్ చేసే స‌న్నివేశం అది. అయితే అక్క‌డ దాదాపు వెయ్యి మంది దొమ్మీ త‌ర‌హాలో కొట్టుకుంటుంటారు. వారిని చెద‌ర‌గొట్ట‌డానికి కంటనీరు చిందిస్తూనే క‌నిక‌రం లేని క‌ర‌కు పోలీస్ గా రామ్ చ‌ర‌ణ్ లాఠీ ప‌ట్టుకుని గుంపుని చెద‌ర‌గొడుతుంటాడు.

ముందు ఈ సీన్ ని హాలీవుడ్ టాప్‌ స్టంట్ మాస్ట‌ర్ నేతృత్వంలో చేయాల‌నుకున్నార‌ట‌. కానీ అనుకున్న ఫీల్‌, అవుట్ పుట్ క‌నిపించ‌క‌పోవ‌డంతో రాజ‌మౌళి నిరుత్సాహానికి గుర‌య్యార‌ట‌. అయితే ఆ త‌రువాత ఇదే ఫైట్ ని సాల్మ‌న్ అనే ఫైట్ మాస్ట‌ర్ కి అప్ప‌గించార‌ట‌. సాల్మ‌న్ చేయ‌గ‌ల‌డా అని అనుమానిస్తున్న స‌మ‌యంలో నెల రోజుల త‌రువాత టెస్ట్ షూట్ చేసి సాల్మ‌న్ తీసుకొచ్చార‌ట‌. అది చూసి ఇంప్రెస్ అయ్యార‌ట రాజ‌మౌళి. ముందు 40 మంది ఫైట‌ర్స్‌, ఆ త‌రువాత 200 మంది ట్రెయిన్డ్ జిమ్ బాయ్స్‌, ఆ త‌రువాత 500 మంది ట్రెయిన్డ్ జూనియ‌ర్ ఆర్టిస్ట్ లు..ఆ త‌రువాత అన్ ట్రైన్డ్ జూనియ‌ర్ ఆర్టీస్ట్‌లు వెర‌సి దాదాపు 2000 మంది తో ఈ ఫైట్ ని షూట్ చేశార‌ట‌. సినిమాలో ఈ ఫైట్ ఎక్కువ స‌మ‌యం వుంటుంద‌ని, ఈ ఫైట్ కోసం రెండు నెల‌ల స‌మ‌యం ప‌ట్టింద‌ని చెప్పారు రాజ‌మౌళి. 2000 మంది మ‌ధ్య ఎన్టీఆర్ ని చ‌ర‌ణ్ అరెస్ట్ చేసే సీన్ దీన్ని బ‌ట్టి చూస్తే బీభ‌త్స‌మే అన్న‌మాట‌.