Begin typing your search above and press return to search.

దుబాయ్ కు వెళ్లే దారిలో RRR టీమ్..!

By:  Tupaki Desk   |   18 March 2022 6:42 AM GMT
దుబాయ్ కు వెళ్లే దారిలో RRR టీమ్..!
X
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ఈ నెల 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

రాజమౌళి - రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యట‌న చేయ‌డానికి సిద్ధమయ్యారు. 7 రోజుల్లో 9 నగరాలను విజిట్ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 23 వ‌ర‌కు దేశం మొత్తం చుట్టి రానున్నారు.

అలానే టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్‌ ను ప్రచారం చేయడానికి చిత్ర యూనిట్ దుబాయ్ కు పయనమయ్యారు. తాజాగా R.R.R దుబాయ్ లో ల్యాండ్ అవబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. వెళ్లే మార్గంలో అంటూ రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ లకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్ ను అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ నడుస్తూ కనిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ హల్ చల్ చేస్తున్నాయి. చరణ్ తన పెంపుడు కుక్క రైమ్‌ ని కూడా తీసుకొచ్చాడని వీటిని చూస్తే అర్థం అవుతోంది. సాయంత్రం 4.30 గంటలకు జరగబోయే దుబాయ్ ఎక్స్ పో-2020 ఈవెంట్ లో ట్రిపుల్ ఆర్ టీమ్ పాల్గొననుంది.

ఈ కార్యక్రమంలో RRR సినిమాకు సంబంధించిన విషయాలను రాజమౌళి వెల్లడించడంతో పాటు ఎన్టీఆర్ - రామ్‌ చరణ్ లు అక్కడి అభిమానులతో ముచ్చటించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ దుబాయ్ లో కూడా ప్రమోషన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇక RRR టీం రేపు 19న బెంగుళూరులో పర్యటించనునుంది. చిక్బల్లాపూర్‌ లో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొననున్నారు. అలాగే మార్చి 20న బరోడాతో పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. అనంత‌రం మార్చి 21న అమృతసర్ - జైపూర్‌ లలో.. మార్చి 22న కోల్ కతా - వారణాసిలో ప‌ర్యటించనున్నారు. మార్చి 23న హైదరాబాద్‌ కు రావడంతో ఈ టూర్ ముగియనుంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ - అలియా భట్ - శ్రియా శరణ్ - ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.