Begin typing your search above and press return to search.

సుజీత్ .. ఈసారైనా స‌న్నివేశాన్ని దారికి తెస్తాడా?

By:  Tupaki Desk   |   16 March 2022 4:35 AM GMT
సుజీత్ .. ఈసారైనా స‌న్నివేశాన్ని దారికి తెస్తాడా?
X
ఒక కొత్త కుర్రాడికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే సాహ‌సం అనుకుంటే .. భారీ పాన్ ఇండియా చిత్రానికి ద‌ర్శ‌కుడిని చేసేయ‌డం అది ఇంకా సాహ‌సోపేత‌మైన‌ది. అలాంటి సాహ‌సం చేశాడు డార్లింగ్ ప్ర‌భాస్. వ‌న్ ఫిలిం కిడ్ గా ఉన్న సుజీత్ ని పిలిచి అత‌డు ఏకంగా 350కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ప‌ని చేసే అవ‌కాశం క‌ల్పించాడు. ఇది ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డ‌మే కాదు నివ్వెర‌ప‌రిచింది. అయితే సాహో చిత్రాన్ని సుజీత్ టెక్నిక‌ల్ వండ‌ర్ గా రూపొందించాడ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. స్క్రీన్ ప్లే విభాగంలో అత‌డు ఆశించిన మ్యాజిక్ జ‌ర‌గ‌క‌పోవ‌డం.. ప్రేమ‌క‌థ‌లో ఫీల్ మిస్స‌వ్వ‌డం వంటి కొన్ని విష‌యాల్ని వ‌దిలేస్తే సాహో చిత్రాన్ని విజువ‌ల్ గ్రాండియారిటీతో టెక్నిక‌ల్ గా అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని ప్ర‌శంసించారు క్రిటిక్స్.

కేవ‌లం రన్ రాజా ర‌న్ అనే ఒక్క హిట్టు మాత్ర‌మే అత‌డి ఖాతాలో ఉంది. అప్ప‌టికి అపార‌మైన అనుభ‌వ‌మేదీ లేదు. కానీ సాహో లాంటి ఛాలెంజ్ ని అది కూడా బాహుబ‌లి స్టార్ తో ప్ర‌యోగం అంటే ఆషామాషీనా? అంచ‌నాలు కూడా అంతే పీక్స్ కి చేరుకున్నాయి. అదే అత‌డికి పెద్ద మైన‌స్ గా మారింద‌ని చెప్పాలి. ఏది ఏం జ‌రిగినా ఇదంతా యువి సంస్థ గ‌ట్ ఫీలింగ్ తోనే సాధ్య‌మైంది. ఇప్ప‌టికీ ప్ర‌భాస్ .. యువి సంస్థ‌ల్లో సుజీత్ కి ఆఫ‌ర్ ఉంది. కానీ అంత‌కుముందే అత‌డు హిట్టు కొట్టి నిరూపించాలి.

ఇప్ప‌టికి రెండు సినిమాల కిడ్ సుజీత్. సాహో త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో రీమేక్ సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నించినా కానీ ఎందుక‌నో అది సాధ్య‌ప‌డ‌లేదు. లూసిఫర్‌ రీమేక్‌ కోసం మెగాస్టార్‌ చిరంజీవి తొలిగా సుజీత్ నే సంప్రదించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టికి ర‌క‌ర‌కాల‌ ఊహాగానాల అనంత‌రం తన మూడవ చిత్రం దర్శకత్వానికి సుజీత్ సిద్ధమవుతున్నాడు. తెలుగులో తేరి రీమేక్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు గత కొన్ని రోజులుగా మీడియాలో సుజీత్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తెలుస్తోంది.

సుజీత్ మూడ‌వ చిత్రం వివ‌రాలు ఇంకా వెల్ల‌డి కాలేదు. కానీ అతను తన తదుపరి చిత్రం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు గ్రాఫిక్ డిజైనర్లను నియమించుకోవడానికి సోషల్ మీడియాలో హైరింగ్ కాల్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుజీత్ తన సొంత నిర్మాణ సంస్థ‌ సైన్ క్రియేషన్స్ లో ఒక చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. అదే సమయంలో తన తదుపరి చిత్రానికి కూడా దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడు.

`హైరింగ్ కాల్` బ్యాన‌ర్ లోనే ఈ రెండు చిత్రాలు తెర‌కెక్కేందుకు ఆస్కారం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. గోపీచంద్.. సుదీప్.. విక్కీ కౌశ‌ల్ వంటి స్టార్ల‌తో సుజీత్ సినిమాలు చేస్తాడ‌ని గ‌తంలో ప్ర‌చ‌రం సాగినా కానీ అవేవీ జ‌ర‌గ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏదీ అధికారికంగా ధృవీకరించింది లేదు. మరికొద్ది రోజుల్లో సుజీత్ తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్ర‌కటించే అవ‌కాశం ఉంది. న‌వ‌త‌రంతో అత‌డు ఏదైనా కొత్త‌గా విభిన్నంగా ప్ర‌య‌త్నించేందుకు ఆస్కారం లేక‌పోలేదు. ర‌న్ రాజా ర‌న్ త‌ర‌హాలోనే పూర్తి వినోదాత్మ‌క చిత్రాన్ని రూపొందించేందుకు సుజీత్ ప్ర‌య‌త్నించే వీలుంద‌ని భావిస్తున్నారు.

ఇక‌పోతే మారుతి లాంటి ద‌ర్శ‌కుడు ఈరోజుల్లో చిత్రంతో హిట్టు కొట్టి ఆ త‌ర్వాత కూడా వ‌ర‌స‌గా మిడ్ రేంజ్ హీరోలు కొత్త త‌రం హీరోల‌తోనే సినిమాలు తీసారు కానీ పెద్ద హీరోల జోలికి వెళ్ల‌లేదు. కానీ సుజీత్ అందుకు భిన్నంగా శ‌ర్వానంద్ త‌ర్వాత నేరుగా బాహుబ‌లి లాంటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసిన‌ ప్ర‌భాస్ తో సాహ‌సం చేశాడు. ఈ డేర్ డెవిల్ ఫీట్ ఫ‌ల‌వంతం కాలేదు. ఆ త‌ర్వాత ఒక్కో ప‌రిణామాన్ని హ్యాండిల్ చేసేందుకు అత‌డి అనుభ‌వం స‌రిపోయి ఉండ‌క‌పోవ‌చ్చు. ఇక‌పై అత‌డు నెమ్మ‌దిగా ఒక్కో మెట్టు తిరిగి నిర్మించుకుంటాడ‌నే ఆశిద్దాం. ఒక్క హిట్టు కొడితే అన్ని ప‌రిస్థితులు దారికొస్తాయి.