Begin typing your search above and press return to search.

ఓటీటీ ఎంట్రీకి మరో అక్కినేని హీరో రెడీ.. ఫస్ట్ లుక్ విడుదల..!

By:  Tupaki Desk   |   18 March 2022 5:30 AM GMT
ఓటీటీ ఎంట్రీకి మరో అక్కినేని హీరో రెడీ.. ఫస్ట్ లుక్ విడుదల..!
X
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒరిజినల్ సినిమాలు - వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగింది. ఓటీటీ కంటెంట్ లో ప్రయోగాలు చేయడానికి ఎలాంటి అవధులు లేకపోవడం.. విలక్షణమైన పాత్రల్లో నటించడానికి అవకాశం ఉండటంతో అగ్ర నటీనటులు సైతం ఓటీటీలలో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

బాలీవుడ్ లో ఇప్పటికే అనేకమంది పాపులర్ స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటించగా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి యవసామ్రాట్ నాగచైతన్య డిజిటల్ వరల్డ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న చైతూ.. 'దూత' అనే ఒరిజినల్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో అక్కినేని హీరో సుశాంత్ ఓటీటీలోకి రావడానికి రెడీ అయ్యారు.

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా కింగ్ నాగార్జున మేనల్లుడుగా 'కాళిదాసు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు సుశాంత్. 'కరెంట్' 'అడ్డా' 'దొంగాట' 'ఆటాడుకుందాంరా' 'చి౹౹ల౹౹సౌ౹౹' వంటి మొదలగు సినిమాలలో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 'అల వైకుంఠపురములో' సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేసిన సుశాంత్.. కరోనా టైంలో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో మంచి విజయం అందుకున్నారు.

ఇప్పుడు వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుండడంతో ఓ ఆసక్తికరమైన కథాంశంతో తొలిసారిగా ఒరిజినల్ సిరీస్ లో నటిస్తున్నారు సుశాంత్. ZEE5 ఓటీటీ రూపొందిస్తున్న ఈ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మి సౌజన్య ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. కొల్లా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్నారు.

నేడు (మార్చి 18) సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు వెబ్ సిరీస్ లో నటించడానికి ముందుకు వచ్చిన సుశాంత్ కు ZEE5 టీం గ్రాండ్ వెల్ కమ్ చెపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

ఇందులో అక్కినేని హీరో పోలీస్ జీప్ ముందు కూల్ గా నిల్చొని ఉన్నాడు. ఫోటో చూస్తుంటే తను ఈ వెబ్ సిరీస్ లో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు సుశాంత్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు. ఇప్పుడు మఫ్టీలో ఉన్న పోలీస్ గెటప్ ను చూస్తుంటే తను నటించే ZEE5 వెబ్ సిరీస్ మీద ఆసక్తి కలుగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికనున్నాయి.