Begin typing your search above and press return to search.

చర్యలైనా తీసుకోండి.. ఆత్మహత్య అయినా చేసుకోనివ్వాలని రాష్ట్రపతికి లేఖ

By:  Tupaki Desk   |   26 March 2022 5:11 AM GMT
చర్యలైనా తీసుకోండి.. ఆత్మహత్య అయినా చేసుకోనివ్వాలని రాష్ట్రపతికి లేఖ
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వద్ద మేనేజర్ గా పనిచేసిన దిశా సాలియన్ అనుమానాస్పద మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ కారణాలతో తన కుమార్తె పేరును చెడుగా ఉపయోగిస్తున్నారంటూ దిశా తల్లిదండ్రులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు.

నిత్యం తమకు ఎదురవుతున్న వేధింపులతో తమ జీవితం దారుణంగా మారిందని.. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నడుమ తమ జీవితాలను ముగించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు లేఖలో వాపోయారు.

రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కొన్ని రోజుల ముందే దిశా మృతి చెందారు. తమ కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని ప్రధానమంత్రి, హోంమంత్రి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరామని దిశా తండ్రి తెలిపారు.

దిశా సాలియన్ , సుశాంత్ సింగ్ ల మృతి 2020లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. దిశ గదిలో కొందరు వ్యక్తులు ప్రవేశించి అత్యాచారం చేశారని చెబుతున్నారని నారాయణ్, నితేష్ లు చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో తాము తలెత్తుకోలేకపోతున్నామని వాపోయారు. వీరి తప్పుడు ఆరోపణలతో నా కుమార్తె వ్యక్తిత్వాన్ని కించపరచడం తమను తీవ్రంగా గాయపరిచిందని చెప్పారు. వీటన్నింటిని చూసి చనిపోవాలని ఎన్నో సార్లు అనుకున్నామని.. మమ్మల్ని ఇంత క్షోభకు గురిచేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. లేకపోతే మాకు చావే శరణ్యం అని లేఖలో వాపోయారు.

ఈ సందర్బంగా దిశ తండ్రి ఎమోషనల్ లేఖ రాశారు. నా కుమార్తె పేరును చెడుగా ఉపయోగించకుండా ఉండేలా చూడాలని దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు విజ్ఞప్తి చేశామని అన్నారు. నా కుమార్తె మరణం, ఆ తర్వాత చోటుచేసుకున్న సుశాంత్ మృతితో ముడిపెడుతూ సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేశారన్నారు. నా కుమార్తె మృతిపై అసలు విషయం బయటపెట్టండి అని దిశా తండ్రి వాపోయారు. దిశా తండ్రి రాష్ట్రపతికి రాసిన లేఖ వైరల్ గా మారింది.