Begin typing your search above and press return to search.

తంబీలు 1000 కోట్ల క్ల‌బ్ లో చేరేదెప్పుడు?

By:  Tupaki Desk   |   29 May 2022 11:30 PM GMT
తంబీలు 1000 కోట్ల క్ల‌బ్ లో చేరేదెప్పుడు?
X
పాన్ ఇండియా సినిమాల వెల్లువ‌కు తెర‌తీసిన టాలీవుడ్ ముందు తంబీల ప‌రిశ్ర‌మ వెల‌వెల‌బోతోంది. దేశంలో అత్యంత ప్రాచీన భాష త‌మిళం అని గ‌ర్వంగా చెప్పుకునే త‌మిళులు.. ద‌క్షిణాది సినిమా పుట్టిందే మా ద‌గ్గ‌ర అని చెప్పుకునే తంబీలు.. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా 1000 కోట్ల క్లబ్ సినిమా తీయ‌లేదు.

నిజానికి త‌మిళులు నేటివిటీ ఫీలింగ్ లో ఎక్క‌డా త‌గ్గ‌రు. ఇరుగు పొరుగు సినిమాల‌ను అదుపులో ఉంచే నైజం తంబీల సొంతం. ఏం చేసినా క‌లిసిక‌ట్టుగా అనుకున్న‌ది సాధించుకుంటారు. రాజ‌కీయంగా కేంద్రానికి ఎదురెళ్లే స‌మ‌ర్థులు. అదంతా స‌రే.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టేజ్ లో తమిళ తంబీల స‌న్నివేశం ఎలా ఉంది? అంటే.. భార‌త‌దేశంలో ఇంత‌వ‌ర‌కూ 1000 కోట్ల క్ల‌బ్ అన్న‌ది త‌మిళ ప‌రిశ్ర‌మ‌కు చిక్క‌డం లేదు. అది అంద‌ని ద్రాక్షే అవుతోంది.

నిజానికి అలాంటి ప్ర‌య‌త్నం చేసిన వారు కూడా అక్క‌డ క‌నిపించ‌లేదు. మ‌హా అయితే పొరుగున ఉన్న తెలుగు మార్కెట్ వారికి అత్యంత ఆద‌ర‌ణ‌నిచ్చేది గా క‌నిపిస్తోంది. ఓవ‌ర్సీస్ క‌లిసొస్తోంది. అలాగే క‌న్న‌డం మ‌ల‌యాళంలో అంతంత మాత్ర‌మే. అయితే బాహుబ‌లి సిరీస్ లా.. ఆర్.ఆర్.ఆర్ లా 1000 కోట్ల క్ల‌బ్ సినిమా త‌మిళుల నుంచి వ‌చ్చేది ఎప్పుడు? అన్న‌దానికి జ‌వాబు లేదు.

శంక‌ర్ - మ‌ణిర‌త్నం - ఏ.ఆర్.మురుగ‌దాస్- అట్లీ- లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి గొప్ప ద‌ర్శ‌కులు త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా కానీ ఇప్ప‌టివ‌ర‌కూ వెయ్యి కోట్ల క్ల‌బ్ త‌మిళుల‌కు ద‌క్క‌లేదు. క‌నీసం క‌న్న‌డ ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన కేజీఎఫ్ 1 - కేజీఎఫ్ 2 త‌ర‌హాలో సంచ‌ల‌నాలు త‌మిళ తంబీల‌కు లేనే లేవు. కానీ దీనిని మార్చే మొన‌గాడెవ‌రు? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్.

ఇంత‌కుముందు బాహుబ‌లి ఘ‌న‌విజ‌యం చూశాక సుంద‌ర్.సి లాంటి ద‌ర్శ‌క‌నిర్మాత భారీగా పాన్ ఇండియా మూవీ కోసం ప్ర‌య‌త్నం చేసారు. శ్రుతిహాస‌న్ ని నాయిక‌గానూ ఎంపిక చేసారు. కానీ ఆ ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అయ్యింది. ఆ త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని కొల్ల‌గొట్టాల‌ని శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించాడు. శ్రీ‌దేవి లాంటి స్టార్ ని దించి మ‌రో శివ‌గామిలా బిల్డ‌ప్ ఇచ్చినా కానీ ఆ మూవీ అట్ట‌ర్ ఫ్లాపైంది. విజ‌య్ కేవ‌లం 200 కోట్ల క్ల‌బ్ కి ప‌రిమిత‌మ‌య్యాడు. కానీ 500 కోట్ల క్లబ్ 1000 కోట్ల క్ల‌బ్ అనేవి అంద‌ని ద్రాక్ష‌లాగా త‌మిళ హీరోల‌ను ఊరిస్తూనే ఉన్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ 500 కోట్ల క్ల‌బ్ అందుకున్న ఏకైక త‌మిళ హీరో ఎవ‌రు? అంటే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే. శంక‌ర్ తెర‌కెక్కించిన 2.0 తో ఈ ఫీట్ సాధ్య‌మైంది. కానీ ఈ సినిమాకి పెట్టిన బ‌డ్జెట్లు రిక‌వ‌ర్ కాలేద‌న్న బ్యాడ్ టాక్ వ‌చ్చింది. ప‌రిమితి మించిన పెట్టుబ‌డుల‌తో 2.0 ఫ్లాపైంది. కానీ ఇప్పుడు చ‌ర‌ణ్‌- దిల్ రాజు బృందంతో క‌లిసి శంక‌ర్ త‌న ఫేట్ ని తానే మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఆర్‌.సి 15 ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా కేట‌గిరీలో అసాధార‌ణంగా రిలీజ‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 1000 కోట్ల క్ల‌బ్ లో చేరుతుందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. అయినా ఇది ఆ ఫీట్ ని సాధించినా కానీ ఒక తెలుగు హీరో సినిమాగానే రికార్డుల‌కెక్కుతుంది. ఒక‌వేళ మునుముందు త‌మిళ తంబీలు 1000 కోట్ల క్ల‌బ్ మూవీని తెర‌కెక్కించినా కానీ దానికి తెలుగు సినీప‌రిశ్ర‌మ స్ఫూర్తిగా నిలుస్తుంది.

మద్రాసు ప‌రిశ్ర‌మ నుంచి విడిపోయిన తెలుగు సినీప‌రిశ్ర‌మ ఇప్పుడు మ‌ద్రాసు (చెన్నై) ప‌రిశ్ర‌మ‌నే డామినేట్ చేస్తోంది. తెలుగు హీరోలు తెలుగు ద‌ర్శ‌కులు ఏల్తున్నారు. పాన్ ఇండియా స్టార్లు అంటే ఒక్క తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే ఉన్నారు అనేంత‌గా రాజ‌మౌళి మ‌న హీరోల్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు హిందీ హీరోల‌కు కూడా ద‌క్క‌నిది తెలుగు హీరోల‌కు ద‌క్కుతోంది.

తెలుగు హీరోలు తెలుగులోను హిందీలోనూ స‌త్తా చాటుతున్నారు. కానీ హిందీ హీరోలు హిందీలో త‌ప్ప తెలుగు త‌మిళంలో రాణించ‌లేరు ఎప్ప‌టికీ. అలాగే నేటివిటీ ఫీలింగ్ తో ఇత‌రుల‌కు ముకుతాడు వేసే త‌మిళ తంబీల‌కు హిందీ ప‌రిశ్ర‌మ‌లో స‌త్తా చాట‌డం అంత వీజీ కాద‌ని ప్రూవైంది. కానీ అన్నిటినీ అధిగ‌మించి స‌త్తా చాటే త‌మిళ‌ హీరో ఎవ‌రో..? ఈ ఛాలెంజ్ ని స్వీక‌రించే త‌మిళ ద‌ర్శ‌క‌నిర్మాత‌లెవ‌రో వేచి చూడాలి.