Begin typing your search above and press return to search.

హీరోగా వినోద్ కుమార్ తనయుడి ఎంట్రీ!

By:  Tupaki Desk   |   2 March 2022 8:30 AM GMT
హీరోగా వినోద్ కుమార్ తనయుడి ఎంట్రీ!
X
హీరోగా వినోద్ కుమార్ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంతోమంది సీనియర్ దర్శకులతో కలిసి పనిచేశారు. తెలుగులో 100కి పైగా సినిమాలు చేసిన ఆయన, తెలుగులో చివరిగా చేసిన సినిమా 'యాత్ర'.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. అలీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ .. " తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోగా నేను ఎలాంటి అవమానాలను ఎదుర్కోలేదు. అందరూ కూడా నన్ను ఎంతగానో గౌరవించారు. నేను కూడా అలాగే నడచుకున్నాను.

సంపాదించిన డబ్బును వృథా చేయకూడదనే విషయాన్ని నేను శోభన్ బాబుగారిని చూసి నేర్చుకున్నాను. ఒక రూపాయి వస్తే 60 పైసలు ఇన్వెస్ట్ చేసి, 40 పైసలు మాత్రం ఖర్చు పెట్టేవాడిని. అలా నాకు కావలసినంత నేను సంపాదించుకున్నాను. డబ్బు మాత్రమే కాదు మంచి స్నేహితులను కూడా సంపాదించుకున్నాను. సుమన్ .. భాను చందర్ .. సాయికుమార్ .. శ్రీకాంత్ వంటి మంచి స్నేహితులు నాకు ఉన్నారు. అప్పట్లో సాయికుమార్ ని మాత్రం కొట్టాలనిపించేది. ఎందుకంటే మమ్ముట్టి .. మోహన్ లాల్ కి తప్ప నాకు డబ్బింగ్ చెప్పేవాడు కాదు.

'మౌనపోరాటం' సినిమా సమయానికి నాకు తెలుగు అసలు రాదు. ఆ సినిమాకి బాలు గారు నాకు డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాను నేను తిరుపతిలో చూశాను. ఇంటర్వెల్ సమయంలో జనం గుర్తుపట్టేసి మీద పడబోయారు. మొత్తానికి అక్కడి నుంచి బయటపడ్డాను. ఒక హీరోకి ఎంతటి క్రేజ్ ఉంటుందనే విషయం అప్పుడే నాకు అర్థమైంది.'సర్పయాగం' షూటింగు సమయంలో నేను రోజాను చూశాను. కొత్తమ్మాయి బాగుందని ఈవీవీ గారితో చెప్పాను. అప్పుడు ఆయన 'సీతారత్నంగారి అబ్బాయి' కోసం తీసుకున్నారు.

కొంతకాలంగా తెలుగులో నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. తెలుగులో కొత్త దర్శకులు వస్తుండటం .. వాళ్లతో నాకు గ్యాప్ ఉండటం వలన అవకాశాలు తగ్గాయి. అంతకుమించి మరో కారణమేదీ లేదు. నాకు ఇద్దరు అబ్బాయిలు .. పెద్దవాడు నాకంటే హైట్ గా ఉంటాడు.

మొన్నీమధ్య కన్నడ సినిమాలో హీరోగా అవకాశం వచ్చినా చేయలేదు. ఎందుకంటే తనకి లాంగ్వేజ్ సమస్య ఉంది. తను పుట్టింది .. పెరిగింది హైదరాబాద్ లోనే. అందువలన వాడికి హీరోగా తెలుగు సినిమాలు చేయాలని ఉంది. మంచి కథ .. మంచి దర్శక నిర్మాతలు దొరికితే చేయాలనుకుంటున్నాడు. త్వరలోనే అలాంటి అవకాశం వస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.