Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్ 2' ఈ సారి రావడం పక్కానే!

By:  Tupaki Desk   |   19 Feb 2022 1:30 PM GMT
కేజీఎఫ్ 2 ఈ సారి రావడం పక్కానే!
X
కన్నడలోను గొప్ప డైరెక్టర్లు ఉన్నారు .. స్టార్ హీరోలు ఉన్నారు. అంతకుముందు కన్నడ నుంచి భారీ హిట్లను ఇచ్చినవారున్నారు. కానీ ఇతర ఇండస్ట్రీలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి కన్నడ సినిమాల వైపు చూసేలా చేసిన సినిమా 'కేజీఎఫ్' అనే చెప్పాలి. అప్పటివరకూ అక్కడ నడుస్తున్న ట్రెండుకు ఈ సినిమా ఫుల్ స్టాప్ పెట్టేసింది.

బడ్జెట్ పరంగా అక్కడి సినిమాల రేంజ్ ను పెంచేసింది. అమాంతగా అక్కడి సినిమాల మార్కెట్ ను పెంచేసింది. ఈ సినిమాతో యశ్ .. ప్రశాంత్ నీల్ పేర్లు ఒక్కసారిగా ప్రపంచమంతా వినిపించాయి.

ఒక కన్నడ సినిమా బాలీవుడ్ దిగ్గజాలను కదిలించడం ఈ సినిమాతోనే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. ఈ కథకు భారీ తారాగణం తోడైతే బహుపసందుగా ఉంటుందని చెప్పుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సీక్వెల్ చేశాడు. సంజయ్ దత్ .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. 'గరుడ' రామ్ .. శ్రీనిధి శెట్టి ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఫస్టు పార్టుకు మించి సెకండ్ పార్టు ఉంటుందని భరోసా ఇచ్చాడు.

కోలార్ ఫీల్డ్ నేపథ్యంలో రూపొందిన 'కేజీఎఫ్ 2'ను 2020 అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కరోనా కారణంగా కుదరకపోవడంతో 2021 జూలై 16వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు కూడా కరోనా తీవ్రంగానే ఉండటం వలన వీలుపడలేదు. ఇలా ఫస్టువేవ్ .. సెకండ్ వేవ్ .. థర్డ్ వేవ్ ఎప్పటికప్పుడు ఈ సినిమా విడుదలకు అడ్డుపడుతూనే వచ్చాయి. ఇక ఇప్పుడు ఎక్కడా కరోనా ప్రభావం అంతగా లేదు. దాంతో 2022 ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఆ డేట్ ను ఫిక్స్ చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఇప్పుడు ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అంతకుముందు రిలీజ్ డేట్లు ప్రకటించినప్పుడు .. అప్పటి పరిస్థితులను బట్టి ఈ సినిమా థియేటర్స్ కి వస్తుందా రాదా అనే ఒక డౌట్ ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సందేహం అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జనం థియేటర్లకు వస్తున్నారు.

టాలీవుడ్ విషయానికే వస్తే 'అఖండ' .. 'పుష్ప' ..' శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు' వంటి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక మిగతా రాష్ట్రాల్లోను సినిమాల జోరు పెరుగుతోంది. అందువలన ఏప్రిల్ 14న వస్తున్న 'కేజీఎఫ్ 2' సంచలనాన్ని సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది.