Begin typing your search above and press return to search.

'ఈటి' రిలీజ్.. రేసులో వెనుక‌బ‌డిందా?

By:  Tupaki Desk   |   9 March 2022 1:30 PM GMT
ఈటి రిలీజ్.. రేసులో వెనుక‌బ‌డిందా?
X
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ఈటి` మార్చి 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తెలుగులో పెద్ద‌గా ప్ర‌చారం క‌ల్పించ‌ని వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. దీనికి తోడు సినిమాకి బ‌జ్ తీసుకురావ‌డంలో టీమ్ మొద‌టి నుంచి వెనుక‌బడే ఉంది. సినిమాకి సంబంధించి కేవ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ మిన‌హా ఇంకెలాంటి ప్ర‌చారం క‌ల్పించ‌లేదు. సాధార‌ణంగా సూర్య సినిమా తెలుగు రిలీజ్ అంటే మీడియాలో బోలెడంత హైప్ క్రియేట్ అవుతుంది. ఈటీ విష‌యంలో వెనుక‌బాటు త‌న‌మే హైలైట్ అవుతోంది.

ఈ సినిమాకి సంబంధించి బుక్ మై షో యాప్ చెక్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ లో పెద్ద‌గా క‌నిపంచ‌లేదు. అన్నీ గ్రీన్ క‌ల‌ర్ లో ఖాళీగానే ఉన్నాయి. మ‌రి సూర్య సినిమా అంటే ఆస‌క్తి త‌గ్గ‌డం అందుకు కార‌ణ‌మా..ప్ర‌చారం లోప‌మా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్క‌డ మ‌రో రీజన్ కూడా తెర‌పైకి వ‌స్తోంది. సూర్య గ‌త రెండు చిత్రాలు `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`..`జై భీమ్` ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కోవిడ్ రాజ్య‌మేలుతోన్న స‌మ‌యంలో ఈ రెండు రిలీజ్ ల్ని సేఫ్ జోన్ లో రిలీజ్ చేసారు. ఈ రెండు ఓటీట‌లో మంచి విజ‌యం సాధించాయి.

ఈ చిత్రాల నిర్మాత సూర్య కావ‌డం విశేషం. ఆ ర‌కంగా సూర్య `ఈటీ` ని థియేట‌ర్లో చూడ‌టానికి ప్రేక్ష‌కులు అనాస‌క్తి చూపిస్తున్నారా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తోంది. ఇదే కొన‌సాగితే `ఈటి` రిజ‌ల్ట్ మ‌రోలా ఉండ‌బోతుంది? అన్న విమ‌ర్శ వినిపిస్తోంది.

ఆ మ‌రుస‌టి రోజున మార్చి 11న పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` రిలీజ్ అవుతుంది. దీంతో `ఈటి`కి థియేట‌ర్లు కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే దొర‌కే అవ‌కాశం ఉంది. అటుపై `ఈటి` థియేట‌ర్లో కొన‌సాగాలేం `రాధేశ్యామ్` టాక్ పై మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉంటుంది.

`రాధేశ్యామ్` సక్సెస్ అయితే `ఈటి `కి దొరికిన కొద్ది పాటి థియేట‌ర్ల‌ని కూడా `రాధేశ్యామ్` ఆక్ర‌మించే అవ‌కాశం ఉంది. మ‌రి రాధేశ్యామ్ పోటీని..`ఈటి`కి బ‌జ్ తీసుకురావ‌డానికి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌యం ఉంది. ఉన్న స‌మ‌యాన్నైనా తెలివిగా వాడుకోగ‌ల్గితే కొన్ని ర‌కాల విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది.

`ఈటి` ట్రైల‌ర్ అంత ఎగ్జైట్ మెంట్ ని తీసుకు రాలేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రొటీన్ మాస్ ట్రైల‌ర్ లా ఉంద‌ని...సూర్య లుక్ సైతం అంతే రొటీన్ గా ఉంద‌ని అంటున్నారు. ఈటి చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుంది.

అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో స‌న్ ఒక‌టి. కానీ `ఈటి` విష‌యంలో నిర్మాత‌లు అంత‌గా దృష్టి సారించిన‌ట్లు క‌నిపంచ‌లేదు. ఇక `ఈటి` సినిమాకు సూర్య స్వ‌యంగా డ‌బ్బింగ్ అందించ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బింగ్ ఆర్టిస్టుల పై ఆధార‌ప‌డ్డ సూర్య తొలిసారి తెలుగులో గాత్రాన్ని అందించారు. సినిమాలో ఇప్ప‌టివ‌ర‌కూ అదే హైలైట్ అంశంగా క‌నిపిస్తోంది.