Begin typing your search above and press return to search.

సూర్య .. ఇంత తొందరైతే ఎలాగబ్బా?!

By:  Tupaki Desk   |   11 March 2022 8:39 AM GMT
సూర్య .. ఇంత తొందరైతే ఎలాగబ్బా?!
X
మొదటి నుంచి కూడా సూర్యకి ఒక అలవాటు ఉంది. తన సినిమాలు హిట్ అయినా .. ఫ్లాప్ అయినా ఆ వెంటనే గ్యాప్ లేకుండా ఆయన తన తరువాత సినిమాను లైన్లో పెట్టేస్తుంటాడు. బయట సినిమాలు ఆలస్యమవుతున్నాయని అనుకున్నప్పుడు తన సొంత బ్యానర్లో సినిమాలను సెట్స్ పైకి తీసుకుని వెళుతుంటాడు.

ఈ కారణంగానే సూర్య సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయనే టాక్ ఆ మధ్య బాగా స్ప్రెడ్ అయింది. ఆ సమయంలోనే ఆయన కొత్తగా ఆలోచన చేసి 'ఆకాశం నీ హద్దురా' .. 'జై భీమ్' సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు ఓటీటీలో వచ్చినవే. అయినా హిట్ టాక్ ను అందుకున్నాయి.

చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన 'ఈటి' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 10వ తేదీన విడుదల చేశారు. E అంటే 'ఎవరికీ' .. T అంటే 'తలవంచడు' అనుకుని 'ఎవరికీ తలవంచడు' అనేది ట్యాగ్ లైన్ గా ఉంచారు. అయితే అసలు 'ఈటి' అనే పొడి అక్షరాల టైటిల్ ఇక్కడి జనానికి చాలా ఇబ్బందిని కలిగించింది .. అయినా చేసేదేమీ లేదు. ఇక 'రాధే శ్యామ్' సినిమాకి ఒక రోజు ముందు ఈ సినిమాను వదిలారు.

ప్రభాస్ కి ఉన్న క్రేజ్ .. ఈ సినిమా పట్ల ఉన్న ఆసక్తి సూర్యకి తెలియంది కాదు. అయినా పాన్ ఇండియా సినిమాను అన్ని చోట్లా ఒకేసారి వదలాలనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకుని రిలీజ్ చేశారు.

నిజానికి ఒక డబ్బింగ్ సినిమా తనకి సరిపడ వసూళ్లను సాధించడానికి ఒక రోజు హౌసుఫుల్ వసూళ్లు సరిపోతాయి. భారీస్థాయిలో రిలీజ్ చేస్తారు కనుక ఈ సౌలభ్యం ఉంది. ఇక టాక్ బాగుంటే ఆ తరువాత వసూళ్ల జోరు కొనసాగుతుంది. 'ఈటి' టీమ్ కూడా ఇలాగే అనుకుంది. కానీ చాలా చోట్ల ఈ సినిమా థియేటర్లకు జనాలు దూర దూరంగానే తిరిగారు.

ఎక్కడ కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించలేదు .. థియేటర్ల దగ్గర నామ మాత్రం జనాలు కనిపించలేదు. అందుకు గల ప్రధానమైన కారణాల్లో టైటిల్ ప్రధానమని చెప్పుకుంటున్నారు. ఇక అలాగే ఇంతకుముందు సూర్య ఇలాంటి సినిమాలు చేశాడు కదా అనుకునేలా ఉన్న అప్ డేట్స్ అంటున్నారు.

ఒకప్పుడు తమిళ పేపర్లు .. తమిళ బోర్డులు చూపించి కథ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుందని చెబితే ఒప్పుకున్నారు గానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మిగతా భాషల ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాలకే ఆదరణ లభిస్తోంది. ఇక తెలుగులో కొత్త ప్రయోగాలు జరుగుతుండటం .. తమిళ హీరోలు ఇంకా అదే మార్కు సినిమాలు చేస్తుండటం కూడా ఇందుకు కారణమని అనుకుంటున్నారు.

ఈ కారణంగానే ఇటీవల కాలంలో తెలుగులో పట్టుమని ఆడిన డబ్బింగ్ సినిమాలు కనిపించడం లేదు. పోనీ 'వలిమై' మాదిరిగా 'ఈటి' తమిళంలో అయినా బాగా ఆడుతుందా అంటే అదీ లేదు. సూర్య ఇక తొందరపాటు తగ్గించుకుని నిదానంగా ముందుకు వెళ్లడమే మంచిదేమో.