Begin typing your search above and press return to search.

'జుండ్' టాక్ కీ .. వసూళ్లకి అసలు పొంతనే లేదే!

By:  Tupaki Desk   |   7 March 2022 10:30 AM GMT
జుండ్ టాక్ కీ .. వసూళ్లకి అసలు పొంతనే లేదే!
X
కొంతమంది మేథావులు కలిసి సినిమా తీయవచ్చు .. మరి కొంతమంది స్టార్స్ కలిసి ఆ సినిమాలో నటించవచ్చు. కానీ ఆ సినిమా ఎలా ఉందన్నది చెప్పాల్సింది సామాన్య ప్రేక్షకులే. వాళ్ల తీర్మానాన్ని అంతా అంగీకరించవలసిందే .. ఆమోదించవలసిందే. అయితే కొన్ని సినిమాల విషయానికి వస్తే .. సినిమా చూసిన వాళ్లంతా అదుర్స్ అంటారు .. కానీ వసూళ్లు మాత్రం ఉండవు. 'మాటలు చూస్తే కోటలు దాటతాయి .. కాళ్లు మాత్రం గడపలు దాటవు' అనే నానుడి ఇలాంటి సందర్భాల్లోనే గుర్తుకు వస్తుంటుంది. ఇప్పుడు 'జుండ్' విషయంలోను అదే జరుగుతోంది.

ఏ సినిమాకైనా వసూళ్లు రావాలంటే .. చూసినవాళ్లు బాగుందంటే సరిపోదు .. అందరూ చూడాలి. అప్పుడే ఆ సినిమా లాభాల బాట పడుతుంది .. గిట్టుబాటు అవుతుంది. 'జుండ్' సినిమా విషయంలో ఇప్పుడు ఇవే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. అమితాబ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాను కొన్ని ఇతర సంస్థలను కలుపుకుని టి సిరీస్ వారు నిర్మించారు. నాగరాజు మంజులే ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ మధ్య మరాఠీలో ఆయన తెరకెక్కించిన 'సైరాట్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అందువలన సహజంగానే అంచనాలు ఉండాలి .. భారీ ఓపెనింగ్స్ ఉండాలి.

ఇది క్రీడా నేపథ్యంలో కొనసాగుతూ యువతలో స్ఫూర్తిని పెంచే కథ. మురికివాడకి చెందిన కొంతమంది పిల్లలను ఒక ఫుట్ బాల్ కోచ్ ఎంపిక చేసి .. వాళ్లని ఫుట్ బాల్ క్రీడాకారులగా తీర్చిదిద్దడమే ఈ కథ. ఇక్కడ కోచ్ పాత్రలో ఉన్నది అమితాబ్. ఆయన ఒక కథను .. పాత్రను అంగీకరించి అడుగుముందుకు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈ సినిమా ఈ నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి కాస్త ముందుగా వచ్చిన 'గంగూబాయి కతియావాడి' చాలా తేలికగా 100 కోట్లను కొల్లగొట్టేసింది. అందువలన ఈ సినిమాకి కూడా వసూళ్ల వర్షము కురవడం ఖాయమని అంతా అనుకున్నారు.

సినిమా రిలీజ్ అయిన వెంటనే సూపర్ .. సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా మామూలుగా లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదనే అన్నారు. దాంతో ఈ సినిమా వసూళ్లకు ఇప్పట్లో అడ్డుకట్ట పడటం కష్టమే అనుకున్నారు. కానీ ఇండియా మొత్తంగా చూసుకుంటే తొలి రోజున కోటిన్నర గ్రాస్ సాధించింది. ఆ తరువాత రోజున 2 కోట్లను రాబట్టింది. నిన్న ఆదివారం కూడా అంతకు దగ్గరగానే వసూళ్లు ఉన్నాయి. అబితాబ్ రేంజ్ కి ఇవి చాలా తక్కువ వసూళ్లనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా సమయంలో జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోయారు. చిన్న సినిమాలు .. మధ్యతరగతి సినిమాలు నెల తిరగ్గానే ఓటీటీలకు వచ్చేస్తాయి. ఈ మాత్రం దానికి థియేటర్ల వైపు పరుగులు పెట్టడం ఎందుకు అనుకుంటున్నారు. టెక్నికల్ గా థియేటర్లలో చూస్తేనే బాగుంటుందని భావించినా, కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయనిపించినా అప్పడు ఆలోచన చేస్తున్నారు.

కమర్షియల్ హంగులున్న సినిమాలకే తప్ప స్ఫూర్తి ప్రధానమైన సినిమాలకు థియేటర్లకు రావడానికి అంతగా ఆసక్తిని కనబరచడం లేదు. ఈ సినిమాకి ఇంత తక్కువ వసూళ్లు రావడానికి ఇదే కారణమని తేల్చేశారు.