Begin typing your search above and press return to search.

ఆ కథలను అలా మారిస్తే ఇలా హిట్టైపోయాయ్!

By:  Tupaki Desk   |   21 March 2022 8:30 AM GMT
ఆ కథలను అలా మారిస్తే ఇలా హిట్టైపోయాయ్!
X
మొదటి నుంచి కూడా మహేశ్ బాబు రీమేకులు చేయడానికి పెద్దగా ఇష్టపడడు. రీమేకుల వలన హీరోకి తన పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో ముందుగానే ఒక క్లారిటీ వస్తుంది. ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అవుతుంది? ఇతర పాత్రల్లో ఏయే ఆర్టిస్టులు సెట్ అవుతారనేది ముందుగానే ఒక అవగాహనకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒరిజినల్ సినిమాకీ .. రీమేక్ సినిమాకి మధ్య పోలికలు మొదలవుతాయి. ఒరిజినల్ సినిమానే బాగా తీశారనీ .. ఆ సినిమాలో హీరోనే బాగా చేశాడనే విమర్శలు తలెత్తుతాయి. అందువలన మహేశ్ బాబు రీమేకుల జోలికి వెళ్లడు.

చాలామంది హీరోలు రీమేకులతో భారీ విజయాలను అందుకుంటున్నప్పటికీ, మహేశ్ బాబు మాత్రం తన మనసు మార్చుకునే ప్రయత్నం చేయడు. తన సినిమాలో తర్వాత ఏం జరగనుందనేది ప్రేక్షకుడికి ముందుగానే తెలియకూడదు అనే ఒక సూత్రాన్ని మాత్రం ఆయన పద్ధతిగా ఫాలో అవుతుంటాడు. ఆయన ఉద్దేశ పూర్వకంగా రీమేక్ లు చేయక పోయినా, ఆయన చేసిన కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మాత్రం అంతకుముందు అదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు గుర్తుకురావడం జరుగుతూ ఉంటుంది.

ఊరును దత్తత చేసుకుని .. ఆ ఊరు అభివృద్ధికి అడ్డుపడిన కొంతమంది అనివీతిపరులకు బుద్ధి చెప్పే కథగా 'శ్రీమంతుడు' కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా చూస్తే, 1984లో బాలకృష్ణ చేసిన 'జననీ జన్మభూమి' సినిమా గుర్తుకువస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఆదరణ పొందలేదు.

ఆ కథకి కమర్షియల్ హంగులను జోడించడం వలన 'శ్రీమంతుడు' సూపర్ హిట్ అయింది. ఇక కృష్ణ .. రమేశ్ బాబులతో కలిసి మహేశ్ చేసిన 'ముగ్గురు కొడుకులు' చూస్తే, ఎన్టీఆర్ .. మురళీమోహన్ తో కలిసి బాలకృష్ణ చేసిన 'అన్నదమ్ముల అనుబంధం' గుర్తుకు వస్తుంది.

మహేశ్ బాబు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'అతడు' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే గతంలో వెంకటేశ్ చేసిన 'వారసుడొచ్చాడు' కళ్లముందు కదలాడుతుంది. చనిపోయిన వ్యక్తి స్థానంలో వచ్చి ఆ కుటుంబ బాధ్యతలను మోసే ఆ సినిమా కథకి 'అతడు' దగ్గరగా అనిపిస్తాడు. ఇక 'పోకిరి' కూడా అంతే.

చిరంజీవి యాక్ట్ చేసిన 'స్టేట్ రౌడీ'కి చాలా దగ్గరగా కనిపిస్తుంది. అంతకుముందు వచ్చిన ఆ సినిమాల కథల్లో మార్పులు చేర్పులు చేసి, మరిన్ని కమర్షియల్ హంగులను జోడించడం వలన మహేశ్ సినిమాలు విజయాలను అందుకున్నాయనిపిస్తుంది.