Begin typing your search above and press return to search.

తెలుగమ్మాయ్ మ‌రో అంజ‌లి అవుతుందా?

By:  Tupaki Desk   |   4 Dec 2022 4:30 PM GMT
తెలుగమ్మాయ్ మ‌రో అంజ‌లి అవుతుందా?
X
చిన్న సినిమాల‌తో మొద‌లై పెద్ద స్టార్ అయ్యింది తెలుగ‌మ్మాయి అంజ‌లి. షాపింగ్ మాల్- జ‌ర్నీ లాంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగులోను ఫాలోయింగ్ సంపాదించింది. నిజానికి ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా కాలం క్రితమే ఆరంగేట్రం చేసినా కానీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా త‌మిళ అనువాదాల‌తో హిట్లు కొట్టి త‌న ఉనికిని తిరిగి టాలీవుడ్ లో చాటుకుంది. మ‌హేష్ -వెంకీ న‌టించిన మ‌ల్టీస్టార‌ర్ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు తో ఒక్క‌సారిగా అంజ‌లికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దాంతో పాటే తెలుగు చిత్ర‌సీమ‌లో పెద్ద అవ‌కాశాలు మొద‌ల‌య్యాయి.

ప‌లువురు టాలీవుడ్ స్టార్ల సినిమాల్లోను అంజ‌లి ఐట‌మ్ నంబ‌ర్లు కూడా చేసింది. చిరు ఖైదీనంబ‌ర్ 150- ర‌వితేజ‌ బ‌లుపు చిత్రాల్లోను అంజ‌లి ఐట‌మ్ ల‌తో మురిపించింది. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ లో ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది. అయితే అంజ‌లితో వంద‌శాతం పోలిక లేదు కానీ.. టాలీవుడ్ లో ఒక తెలుగ‌మ్మాయ్ అంజ‌లి అంత ట్యాలెంట్ ఉండీ ఎందుక‌నో రేసులో వెన‌క‌బ‌డింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ? అంటే.. అనంత‌పురం అమ్మాయి ప్రియాంక జ‌వాల్క‌ర్. అందానికి అందం ప్ర‌తిభ వేగం ఉన్న ఈ బ్యూటీకి స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ఆశించినంత‌గా రాలేద‌నే చెప్పాలి. టాక్సీవాలా లాంటి చిత్రంలో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న‌... ఎస్‌ఆర్ కళ్యాణమండపంలో యువ‌హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న అద్భుతంగా న‌టించింది. కానీ అగ్ర‌హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు అయితే లేవు. కానీ ఇప్పుడు ప్రియాంక‌కు ఫేజ్ ఛేంజ‌యింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. నెమ్మ‌దిగా ఈ తెలుగు బ్యూటీ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. ఇప్పుడు ఏకంగా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో అవ‌కాశం అందుకుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

బాల‌య్య‌తో అనిల్ రావిపూడి కాంబినేష‌న్ లో భారీ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. షూటింగ్ షెడ్యూళ్ల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ప్ర‌స్తుతం కాస్టింగ్ ఎంపిక‌లు సాగుతున్నాయి. తాజా సమాచారం ప్ర‌కారం.. ఒక క‌థానాయిక‌గా యువ కథానాయిక ప్రియాంక జువాల్క‌ర్ ని లాక్ చేసాడని గుస‌గుస వైర‌ల్ అవుతోంది.

ఈ చిత్రంలో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్రలో ప్రియాంక‌ కనిపించనుంది. షూటింగ్ ప్రారంభంలోనే ఈ వార్త‌ను అధికారికంగా ధృవీక‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. అగ్ర‌హీరో స‌ర‌స‌న అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ప్రియాంక మ‌రింత‌గా దూసుకెళుతుంద‌నే ఆశిద్దాం.